డ్రోన్‌ కెమెరాల్లో మావోయిస్టుల కదలికలు

14 Sep, 2020 04:06 IST|Sakshi

డ్రోన్‌ కెమెరాల్లో మావోయిస్టుల కదలికలు 

ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాష్ట్రంవైపు వస్తున్నట్లు గుర్తింపు

సరిహద్దుల్లో అప్రమత్తమైన బలగాలు 

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టుల కదలికలను కనిపెట్టేందుకు పోలీసులు వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సత్ఫలితాలనిస్తోంది. ఆదివారం పోలీసులు డ్రోన్‌ వీడియో కెమెరా ద్వారా మావోలకు సంబంధించి కచ్చితమైన వివరాలు కనుగొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీసుస్టేషన్‌ పరిధిలో పాలోడి అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు వాగు దాటుతున్నట్లు డ్రోన్‌ కెమెరా ద్వారా వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. వీరంతా తెలంగాణ వైపు వస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య నిరంతరం పోరు నడుస్తోంది. గత కొన్ని నెలలుగా తెలంగాణలోనూ మావోయిస్టులు తమ కార్యకలాపాలను పెంచుతున్నారు.

ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత రెండు నెలల్లో పలుసార్లు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 3న భద్రాద్రి జిల్లా గుండాల మండలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు, 7వ తేదీన చర్ల మండలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో వాగు దాటుతూ తెలంగాణ వైపు వస్తున్నట్లు డ్రోన్‌ కెమెరాలు కనిపెట్టాయి. దీంతో రాష్ట్రంలోని ములుగు, భద్రాచలం, పినపాక, మంథని నియోజకవర్గాల్లో పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు.

మరిన్ని వార్తలు