సొంత సంస్థల్లోకి మళ్లిస్తున్నారు

17 Mar, 2023 03:40 IST|Sakshi

మార్గదర్శి.. మరో అగ్రిగోల్డ్, సహారా కాకముందే చర్యలు చేపట్టాం

విచారణ ‘పరిధి’ అంశం పెండింగ్‌లో ఉండగా క్వాష్‌ పిటిషనా?

తెలంగాణ హైకోర్టుకు నివేదించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సంస్థ తన ఖాతాదారుల నుంచి వసూలు చేసిన నగదును సొంత సంస్థల్లోకి మళ్లిస్తోందని, అవి నష్టాల్లోకి వెళ్తే వేలాది కుటుంబాలు వీధిన పడతాయని  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. మార్గదర్శి మరో అగ్రిగోల్డ్, సహారా మాదిరిగా కాకముందే జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నందున పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లో తమ సంస్థకు చెందిన పలు బ్రాంచ్‌లపై నమోదైన కేసులను కొట్టివేయాలని / దర్యాప్తుపై స్టే ఇవ్వాలని అభ్యర్థిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణను ఏపీలో కాకుండా మరో రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని, అప్పటివరకు ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ సురేందర్‌ వాదనలు విన్నారు.

పిటిషనర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూత్రా, ఏపీ ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ గోవిందరెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు. విచారణ ‘పరిధి’, కేసు మెరిట్‌ అంశాలపై వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు.  

పునర్విభజన చట్టానికి విరుద్ధం
‘మార్గదర్శి అక్రమాలపై 409, 477(ఏ), 420 సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ పదేళ్లకు పైగా శిక్ష పడే కేసులే. ఏపీలో నమోదైన కేసులపై ఇక్కడ రిలీఫ్‌ కోరలేరు. ఒకట్రెండు అంశాల్లో మినహా ఏపీ హైకోర్టు పరిధిలోని అంశాలపై తెలంగాణ హైకోర్టు కలుగజేసుకునే అవకాశం లేదు. కేసులు నమోదైన నేరాలన్నీ ఏపీలోనే జరిగాయి. దర్యాప్తు చేస్తున్న పోలీసులూ అక్కడి వారే. అలాంటప్పుడు ఇక్కడ అరెస్టులు చేయవద్దని కోరడం చట్ట విరుద్ధం.

ఏపీ హైకోర్టు పరిధిలో కలుగజేసుకోలేమని ఇదే హైకోర్టు కూడా పలు తీర్పులను ఇచ్చింది’ అని ఏపీ ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ గోవిందరెడ్డి నివేదించారు. ‘పరిధి’ అంశం తేలకుండానే మళ్లీ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయడం దర్యాప్తును అడ్డుకోవడమే అవుతుందన్నారు. ఖాతాదారుల నుంచి వసూలు చేసిన నగదును మ్యూచువల్‌ ఫండ్స్, షేర్‌ మార్కెట్లలోకి అక్రమంగా మళ్లిస్తున్నారని చెప్పారు. చిట్స్‌ పేర డబ్బులు సేకరించి ఉషాకిరణ్‌ లాంటి సంస్థల్లోకి మళ్లిస్తున్నారని తెలిపారు.   

మరో రాష్ట్రానికి మార్చండి..
‘మార్గదర్శి కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఇక్కడి నుంచే బ్రాంచ్‌ల పర్యవేక్షణ జరుగుతుంది. చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఇక్కడే ఉంటారు. అందుకే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాం. దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలి. ఖాతాదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకున్నా తనిఖీలు చేస్తున్నారు’ అని సిద్దార్థ లూత్రా పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు