వ్యాక్సిన్‌.. మీ ఇష్టమే

19 Dec, 2020 01:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

టీకా వేసుకున్న తర్వాత కూడా మాస్క్‌ ధరించాల్సిందే

వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత జ్వరం వచ్చే అవకాశం

వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత అరగంటపాటు కేంద్రంలోనే ఉండాలి

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికే వ్యాక్సిన్‌

దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ స్వచ్ఛందమేనని.. టీకా వేసుకోవాలంటూ ఎవరినీ ఒత్తిడి చేయబోమని కేంద్రం స్పష్టం చేసింది. అయితే వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ టీకా వేసుకోవడం మంచిదని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు ఇతరులకు వైరస్‌ సోకకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని సూచించింది. టీకా వేసుకోదలచిన వారు మాత్రం తప్పనిసరిగా సంబంధిత షెడ్యూల్‌ పాటించాలని పేర్కొంది. 

సాక్షి, హైదరాబాద్ ‌: దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ స్వచ్ఛందమేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీకా వేసుకోవాలంటూ ఎవరినీ ఒత్తిడి చేయబోమని తేల్చి చెప్పింది. అయితే వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ టీకా వేసుకోవడం మంచిదని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు ఇతరులకు వైరస్‌ సోకకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని సూచించింది. టీకా వేసుకోదలచిన వారు మాత్రం తప్పనిసరిగా సంబంధిత షెడ్యూల్‌ పాటించాలని పేర్కొంది. అతితక్కువ సమయంలోనే పలు సంస్థలు ప్రయోగాలు చేపట్టి వ్యాక్సిన్‌ను విడుదల చేయనున్న నేపథ్యంలో టీకా సమర్థత, భద్రతపై నెటిజన్లు వెలిబుచ్చిన సందేహాలు, వ్యక్తం చేసిన అనుమానాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం ఈ మేరకు నివృత్తి చేసింది. ప్రజల అనుమానాలను ప్రశ్న–జవాబుల రూపంలో వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. దేశంలో ప్రవేశపెట్టబోయే వ్యాక్సిన్‌ ఇతర దేశాలు అభివృద్ధి చేసిన టీకాల్లాగానే ప్రభావవంతంగా పనిచేస్తుందని భరోసా ఇచ్చింది.

భద్రమని తేలాకే పంపిణీ...
కరోనా వ్యాక్సిన్‌ వాడకం భద్రమని తేలాకే దాని పంపిణీ చేపడతామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. టీకా సమర్థత, భద్రతపై నియంత్రణ సంస్థల నుంచి అన్ని అనుమతులు లభించాకే దాన్ని ప్రజలకు అందిస్తామని వెల్లడించింది. టీకాల విషయంలో భారత్‌ ఎంతో అనుభవం కలిగి ఉందని, 2.60 కోట్ల మందికిపైగా నవజాత శిశువులు, 2.90 కోట్ల మంది గర్భిణులకు టీకాలు వేయడంలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామి దేశమని కేంద్రం పేర్కొంది.

రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే...
‘‘టీకాలు వేయించుకోదలచిన వారు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. లేకుంటే వ్యాక్సిన్‌ పొందడానికి అవకాశం లేదు. రిజిస్ట్రేషన్‌ చేసుకొనేటప్పుడు ఫొటో గుర్తింపు కార్డు అవసరం. ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు, బ్యాంక్‌ లేదా పోస్ట్‌ ఆఫీస్‌ జారీ చేసిన పాస్‌బుక్‌లు, పాన్‌ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్‌ ఐడీ, పెన్షన్‌ డాక్యుమెంట్‌ తదితర వాటిలో ఏదో ఒక దాని వివరాలు రిజిస్ట్రేషన్‌ సమయంలో నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత లబ్ధిదారుడి మొబైల్‌ నంబర్‌కు నిర్ణీత తేదీ, వ్యాక్సిన్‌ కేంద్రం ఉన్న ప్రదేశం, టీకా సమయం వివరాలతో ఎస్‌ఎంఎస్‌ అందుతుంది. టీకా కేంద్రం వద్ద కూడా ఈ ఎస్‌ఎంఎస్‌ చూపించాలి. వ్యాక్సిన్‌ వేసుకున్నాక కూడా లబ్ధిదారుడి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు మెసేజ్‌ వస్తుంది. వ్యాక్సిన్‌ అన్ని డోసులను పొందిన తరువాత వారి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత సర్టిఫికెట్‌ కూడా పంపుతాం’’ అని కేంద్రం తెలిపింది.

వ్యాక్సిన్‌ వేసుకున్నాక జ్వరం రావొచ్చు...
‘‘కరోనా టీకా వేసుకుంటే కొందరిలో తేలికపాటి జ్వరం, ఇంజక్షన్‌ చేసిన ప్రదేశంలో నొప్పి మొదలైనవి రావచ్చు. వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలను ఎదుర్కోవడానికి ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను ఆదేశించాం. టీకా వేసుకున్నాక అరగంటపాటు టీకా కేంద్రంలోనే విశ్రాంతి తీసుకోవాలి. అసౌకర్యంగా అనిపిస్తే అధికారులు, ఆశ/ఏఎన్‌ఎంలకు తెలియజేయాలి. షెడ్యూల్‌ పూర్తి చేయడానికి ఒక వ్యక్తి రెండు డోసుల వ్యాక్సిన్‌ను 28 రోజుల వ్యవధిలో తీసుకోవాలి. రెండు డోస్‌లు వేసుకున్న రెండు వారాల తర్వాత శరీరంలో సాధారణంగా యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి. 

కరోనా ఉన్న వారికి  వ్యాక్సిన్‌ కుదరదు..
కరోనా ఉన్న వ్యక్తులకు ఆ సమయంలో టీకా వేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఎందుకంటే సంబంధిత వ్యక్తి టీకా కేంద్రానికి వస్తే ఇతరులకు వ్యాపింపజేసే ప్రమాదం ఉంటుందని పేర్కొంది. అలాంటి వారు కోలుకున్న తర్వాత అంటే 14 రోజుల తర్వాత టీకా తీసుకోవచ్చని సూచించింది. మరోవైపు కరోనా టీకా వేసుకున్న తరువాత కూడా ప్రజలు మాస్క్‌లు ధరించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. చేతులు శుభ్రపరుచుకోవాలని, భౌతికదూరం నిబంధనను పాటించాలని సూచించింది.

తొలుత కరోనా వారియర్లకే...
టీకా పంపిణీ ప్రారంభ దశలో పరిమితమైన సరఫరా కారణంగా మొదట కరోనాపై ముందుండి పోరాడుతున్న వారికి అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఉన్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు ముందుగా టీకా ఇస్తామని పేర్కొంది. అలాగే ఫ్రంట్‌లైన్‌ కార్మికులకు ఇస్తామని వివరించింది. తరువాతి దశల్లో అనారోగ్యం, తీవ్రమైన అనారోగ్యంగల వ్యక్తులను అధిక ప్రమాదవర్గంగా పరిగణించి టీకా అందించనుంది. 50 ఏళ్లు పైబడిన వ్యక్తులు, 50 ఏళ్లలోపు అనారోగ్యాలతో ఉన్న వారికి కూడా ఇస్తామని కేంద్రం వివరించింది. 50 ఏళ్లకుపైగా వయసుగల వారిని రెండు ఉప గ్రూపులుగా విభజించారు. ఉప గ్రూప్‌లో 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ ఉన్న వారిని, రెండో ఉప గ్రూప్‌లో 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసుగల వారిని చేర్చారు. 
 

Poll
Loading...
మరిన్ని వార్తలు