మెడికల్‌ పీజీ పరీక్షల్లో నిర్వాకం.. ఆలస్యంగా వెలుగులోకి!

8 Dec, 2020 10:57 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కళాశాల(కేఎంసీ)లో మెడికల్‌ పీజీ పరీక్షల సందర్భంగా హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల విద్యార్థులకు కేఎంసీలో నిర్వహిస్తున్న సప్లమెంటరీ పీజీ పరీక్షలు రెండ్రోజుల క్రితం ముగిశాయి. కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్‌ కళాశాలకు చెందిన విద్యార్థి ఒకరు హైటెక్‌ విధానంలో కాపీయింగ్‌ చేస్తూ పట్టుబడిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది.

కాపీ ఇలా..
కేఎంసీలో 15 రోజులు పరీక్షలు జరగ్గా చివరి రోజే వైద్య విద్యార్థి పట్టుబడటం అనుమానాలకు తావిస్తోంది. ఈ విద్యార్థి ఓ కారు తీసుకొచ్చి పరీక్ష గది వెనుక ఉంచారు. కారు డ్రైవర్‌గా సాంకేతిక పరిజ్ఞానమున్న వ్యక్తిని ఉంచి దానికి యాంటీనా బిగించారు. విద్యార్థి మోకాళ్లలో రిసీవర్‌ ఉంచుకుని వైర్‌లెస్‌ ఫోన్‌ ద్వారా జవాబులు రాసినట్లు సమాచారం. చివరి రోజు అనుమానాస్పదంగా ఉన్న కారును గుర్తించిన పరిపాలనాధికారులు ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఎందరున్నారో తేలాలి..
కేఎంసీలో జరిగిన మాస్‌ కాపీయింగ్‌ వెనుక కొందరు ఉద్యోగుల హస్తమున్నట్లు తెలుస్తోంది. పరీక్ష నిర్వహణకు ప్రశ్నపత్రాన్ని ఓ ఔట్‌సోరి్సంగ్‌ ఉద్యోగి డౌన్‌లోడ్‌ చేసి తనను ఆశ్రయించిన కొందరు వైద్య విద్యార్థులకు చేరవేసినట్లు సమాచారం. తద్వారా ఆ ప్రశ్నల జవాబు ను విద్యార్థి మైక్‌ రిసీవర్, వైర్‌లైస్‌ ఫోన్‌ ద్వారా తెలుసుకుని కాపీయింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ తతంగానికి సహకరించి నందుకు విద్యార్థులు కొందరు ఉద్యోగు లకు రూ.లక్షల్లో చెల్లించినట్లు సమాచారం. రెగ్యులర్‌ ఉద్యోగులను కాకుండా ఔట్‌సోరి్సంగ్‌ వారిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే, కేఎంసీలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తే కాపీయింగ్‌లో ఇంకా ఎందరున్నారనేది తెలుస్తుందని చెబుతున్నారు.

యూనివర్సిటీకి వివరాలిచ్చాం..
ఇటీవల నిర్వహించిన మెడికల్‌ పీజీ సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని గుర్తించాం. చాలా తెలివిగా కరోనా నిబంధనలను సాకుగా చేసుకుని హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. మోకాళ్ల వద్ద వైర్‌లెస్‌ రిసీవర్‌ ఉంచుకుని జవాబులు తెలుసుకున్నాడు. ప్రతిమ కళాశాలకు చెందిన ఆ విద్యార్థి వివరాలను కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీకి అప్పగించాం. తదుపరి చర్యలు యూనివర్సిటీ అధికారులు తీసుకుంటారు.
– డాక్టర్‌ సంధ్య, కేఎంసీ ప్రిన్సిపాల్‌ 

9 నుంచి వ్యవసాయ డిగ్రీ కోర్సుల కౌన్సెలింగ్‌
రాజేంద్రనగర్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని బైపీసీ స్ట్రీమ్‌ (హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ)లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల కోసం ఈనెల 9వ తేదీ నుంచి సంయుక్తం గా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌.సుధీర్‌కుమార్‌ తెలిపారు. బీఎస్సీ (హానర్స్‌) అగ్రికల్చర్‌ 432 సీట్లు, బీఎస్సీ (హానర్స్‌) హార్టికల్చర్‌ 130 సీట్లకు, బీవీఎస్‌సీ, ఏహెచ్‌ 158 సీట్లకు, బీఎఫ్‌ఎస్సీ 36 సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో వివరించారు. అడ్మిషన్‌ పొందిన అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సమర్పిం చి నిర్ణీత ఫీజును వెంటనే చెల్లించాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.pjtrau. edu.in లో లాగిన్‌ కావాలని తెలిపారు. బీఎస్సీ (హానర్స్‌) అగ్రికల్చర్, బీఎస్సీ (హానర్స్‌)హార్టికల్చర్‌ పేమెంట్‌ కోటా సీట్ల కోసం విడిగా కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. 

తెలుగు వర్సిటీ పరీక్షలు యథాతథం
నాంపల్లి (హైదరాబాద్‌): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం నిర్వహించే వార్షిక పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని, ఈ నెల 8న జరిగే భారత్‌ బంద్‌కు పరీక్షలకు ఎలాంటి సంబంధం ఉండదని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య రమేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి 18 వరకు తెలుగు వర్సిటీ అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతాయన్నారు. యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులతో పాటుగా బ్యాక్‌లాగ్‌ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని వివరించారు. భారత్‌ బంద్‌ జరిగే మంగళవారం కూడా పరీక్షలు ఉంటాయని, విద్యార్థులు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు. 

నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా..
సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ బంద్‌ నేపథ్యంలో మంగళవారం నిర్వహించే పలు పరీక్షలను వర్సిటీలు వాయిదా వేశాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సుల సెమిస్టర్‌ పరీక్షల్లో భాగంగా మంగళవారం నాటి పరీక్షలన్నింటినీ వాయిదా వేసినట్లు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ ప్రొ. మంజూర్‌ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను 10న నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 8 నాటి పాలిటెక్నిక్‌ డిప్లమా సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేసినట్లు ఎస్‌బీటీఈటీ కార్యదర్శి శ్రీనాథ్‌ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను ఈ నెల 23న నిర్వహిస్తామన్నారు.

సీపీజీఈటీ పరీక్షను వాయిదా వేసినట్లు ఉస్మానియా వర్సిటీ వెల్లడించింది. తమ పరిధిలో ఈ నెల 8న జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశామని, 9 నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిధిగా ఉంటాయంది. అలాగే, భారత్‌ బంద్‌ నేపథ్యంలో కాళోజి హెల్త్‌ యూనివర్సిటీ పరిధిలో మంగళవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. వాయిదా పడిన బీపీటీ, బీఎస్సీ ఎంఎల్‌టీ సెకండియర్‌ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ఈ నెల 9న జరిగే పరీక్షలన్నీ యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది.

18న పీజీ..19న డిగ్రీ పరీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 18 నుంచి వివిధ పీజీ కోర్సుల (రెగ్యులర్‌) రెండో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 19 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల ఇయర్‌ వైజ్‌ పరీక్షలు జరగనున్నట్లు ఓయూ ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ ప్రొ. శ్రీరామ్‌ వెంకటేశ్‌ తెలిపారు. ఓయూ ప్రీ–పీహెచ్‌డీ పరీక్షలు ఈ నెల 28, 30 తేదీలలో నిర్వహిస్తామన్నారు. పీహెచ్‌డీ విద్యార్థులు జంటనగరాలతో పాటు ఆయా జిల్లాల్లో పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు ఓయూ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.

మరిన్ని వార్తలు