జాతి  పండగకు  జేజేలు

16 Aug, 2022 08:46 IST|Sakshi
గోల్కండ కోటలో బలగాల కవాతు, రవీంద్ర భారతిలో సాంస్కృతికి ప్రదర్శన

సాక్షి, హైదరాబాద్‌: భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నగరంలోని అబిడ్స్‌ జీపీఓ సర్కిల్‌ నెహ్రూ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు సామూహిక  జాతీయ గీతాలాపన జరగనుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరు కానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఉద్యోగులతో పాటు కళాశాల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గోనున్నారు. జీపీఓ సర్కిల్‌ వద్ద స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలు ప్రదర్శించనున్నారు. రంగురంగుల బ్యానర్లు, గీతాలాపన చేయడానికి మైక్‌ ఏర్పాట్లు  చేశారు.


గోల్కొండ కోటలో జాతీయ పతాకంతో కళాకారుడి ఆనంద హేల

సామూహిక గీతాలాపన ఏర్పాట్లను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌  పరిశీలించారు. ట్రాఫిక్‌ నిబంధనలు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జీఏడీ కార్యదర్శి శేషాద్రి, అడిషనల్‌ డీజీపీ జితేందర్, పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఉన్నత విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, కార్యదర్శి వాకాటి కరుణ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్, హైదరాబాద్‌ కలెక్టర్‌ అమయ్‌ కుమార్, సిటీ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తదితరులు ఉన్నారు.    


ర్యాలీ నిర్వహిస్తున్న అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అధ్యాపకులు

తిరంగా సంబరం తరంగమై ఎగిసింది. నగరం అంగరంగ వైభవంగా మెరిసింది. మువ్వన్నెల జెండా వజ్రోత్సవంలా మురిసింది. స్వాతంత్య్ర శోభ వెల్లివిరిసింది. ఇళ్లు, వీధులు, వాహనాలపై త్రివర్ణ పతాకాలు సమున్నతంగా ఆవిష్కృతమయ్యాయి. సోమవారం నగరంలో స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు అంబరమంటాయి. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌ రోడ్‌ ప్రాంతాల్లో భారీ జెండాలతో బైక్‌ ర్యాలీలు, కారు ర్యాలీలు జోరుగా సాగాయి. భారీ జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


పాతబస్తీలో జాతీయ జెండాలతో ఉత్సాహంగా ముస్లిం మహిళలు

వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి పది మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన పతాకాలు చూడముచ్చగా కనువిందు చేశాయి. సంజీవయ్య పార్క్‌ సమీపంలో జాతీయ జెండాలతో వింటేజ్‌ కార్లతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. అబిడ్స్‌ మొజంజాహీ మార్కెట్‌ వేదికగా అతి పొడవైన జాతీయ జెండాతో చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  కళాశాలు, స్కూళ్లలో వేడుకలు ఆనందోత్సాహాలతో సాగాయి. కళాకారులు దేశభక్తి ఉట్టిపడేలా తయారైన విధానం అందరినీ ఆకట్టుకుంది.


ట్యాంక్‌బండ్‌పై త్రివర్ణ పతాకాలతో ర్యాలీ

నగరంలోని చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలతో పాటు నలుమూలలా వ్యాపించి ఉన్న కార్పొరేట్‌ ఆఫీసుల్లో, ఐటీ కంపెనీల్లో, విద్యా సంస్థల్లో 75 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోల్కొండ కోట వేదికగా ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలతో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాల్లో నగర యువత ఆసక్తిగా పాల్గొని సందడి చేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా నగరానికి చెందిన మైక్రో ఆరి్టస్టు కృష్ణ ఉట్ల బియ్యపు గింజపై జాతీయ జెండాను రూపొందించారు. చిన్న పరిమాణంలో ఉండే బియ్యపు గింజపై అశోక చక్రం, మూడు వర్ణాలతో ఉన్న జాతీయ జెండాను వేసి దేశభక్తిని చాటుకున్నాడు.        
– సాక్షి, సిటీబ్యూరో  

(చదవండి: దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ శక్తులను అడ్డుకోవాలి)

మరిన్ని వార్తలు