రెవెన్యూ శాఖలో భారీ ప్రక్షాళనలు

26 Aug, 2020 09:21 IST|Sakshi

12 మంది ఆర్‌ఐలు, సీనియర్‌ అసిస్టెంట్ల బదిలీ  

త్వరలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏల బదిలీలు?   

కీసర తహసీల్దార్‌ నాగరాజు అవినీతి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం  చర్యలు 

సాక్షి, మేడ్చల్‌ జిల్లా : రెవెన్యూ శాఖలో భారీ ప్రక్షాళనకు జిల్లా అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. తాజాగా మేడ్చల్‌ జిల్లాలో 11 మంది తహసీల్దార్లను బదిలీ చేసిన యంత్రాంగం మంగళవారం మరో 12 మంది ఆర్‌ఐలు, సీనియర్‌ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల కీసర తహసీల్దార్‌ నాగరాజు రాంపల్లి దాయార రెవెన్యూ పరిధిలో భూ మార్పిడి, పట్టాదారు పాసు పుస్తకాల జారీ విషయంలో రియల్టర్‌ బ్రోకర్ల వద్ద నుంచి  రూ. 1.10 కోట్ల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రక్షాళనపై జిల్లా అదనపు కలెక్టర్‌ కె.విద్యాసాగర్‌ ప్రత్యేక దృష్టిని సారించినట్లు తెలుస్తున్నది. జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖలో అవినీతి ఉద్యోగుల ఏరివేత ప్రక్రియలో భాగంగా పెద్ద ఎత్తున బదిలీలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తున్నది. గ్రేటర్‌ హైదరాబాద్‌ సమీపంలోని మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలోని భూముల ధరలకు రెక్కలు రావటంతో రెవెన్యూ శాఖలో అవినీతికి అందులేకుండా పోయింది. భూరికార్డుల ప్రక్షాళనతో ఆరంభమైన రెవెన్యూ శాఖ అవినీతి భాగోతం పరాకాష్టకు చేరుకుంది. అందులో భాగంగా కీసర నుంచి మొదలుకొని అనేక సంఘటనలు వెలుగు చూశాయి. (చదవండి : గిన్నిస్ బుక్ రికార్డులోకి కీస‌ర త‌హ‌సీల్దార్)

ఇదిలా ఉండగా, జిల్లాలో 12 వేల ఎకరాలకు సంబంధించిన భూములు పలు వివాదాలతో పలు కోర్టుల్లో మగ్గుతుండగా, వందలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌ భూములపై కన్నేసిన కొందరు కబ్జాదారులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. నగర శివారులోని కోట్లాది రూపాయల విలువ చేసే భూములను పరిరక్షించాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ముఖ్యంగా రెవెన్యూ శాఖపై ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు పరిరక్షణ, వివాదాల్లోని భూములకు సత్వర పరిష్కారం తదితర విషయాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికార యంత్రాంగం రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా బదిలీలకు తెరలేపినట్లు తెలుస్తున్నది.(చదవండి : విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌ని ఎమ్మార్వో నాగ‌రాజు!)

అందులో భాగంగా జిల్లాలో 12 మంది ఆర్‌ఐలు (గీర్దావరులు), సీనియర్‌ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ కలెక్టర్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గీర్దార్‌వర్‌ (ఆర్‌ఐ) కిరణ్‌కుమార్‌ కీసర మండలంతోపాటు శామీర్‌పేట్‌లో పని చేసిన కాలంలో పలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. కీసరలో ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌ నాగరాజుకు ఆర్‌ఐ కిరణ్‌కుమార్‌ ప్రధాన అనుచరుడిగా పేరుంది. అలాగే నాగారం మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌గూడలో అసైన్డ్‌ భూముల్లో ఇళ్లు వేసుకున్న పేదల నుంచి ఒక్కొకరి నుంచి రూ. 50 వేల నుంచి రూ. లక్ష స్థానిక వీఆర్‌ఓతో కలిసి వసూలు చేశారనే ఆరోపణల్లో కిరణ్‌ కుమార్‌ ప్రధాన వ్యక్తిగా స్థానిక ప్రజల్లో ప్రచారం ఉంది. వెలుగులోకి రాని అవినీతి ఆర్‌ఐలకు కూడా బదిలీల్లో చోటు లభించింది. త్వరలో పెద్ద ఎత్తున  వీఆర్‌ఓ, వీఆర్‌ఏల బదిలీలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు