ఈసారీ ఈడబ్ల్యూఎస్‌ కోటా లేనట్లే!

10 Oct, 2020 02:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈసారీ ఎంసెట్‌ ప్రవేశాల్లో రిజర్వేషన్ల కోటా లేనట్లే. దరఖాస్తు సమయంలో ఈడబ్ల్యూఎస్‌ ఆప్షన్‌ ఉన్నప్పటికీ వెబ్‌సైట్‌లో వివరాల నమోదు ప్రక్రియలో మాత్రం లేదు. దీంతో వారంతా ఓపెన్‌ కేటగిరీ విద్యార్థులతో తలపడాల్సిందే. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్‌–20లో అమలు చేయకపోవడమే దీనికి కారణం. అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు ఉన్నత విద్య, ప్రభుత్వోద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్‌(ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌) కింద 10శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, జాతీయస్థాయి విద్యాసంస్థల సీట్ల భర్తీలో గతేడాది నుంచే కేంద్రం దీన్ని అమలు చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విద్యాసంస్థల్లో ఈ చట్టం అమలు కావాలంటే దీనిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాలి. కానీ ఈడబ్ల్యూఎస్‌ అమలుపై రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై సందిగ్ధం నెలకొంది. 

వెబ్‌సైట్‌ వివరాల నమోదులో కనిపించని ఆప్షన్‌... 
ఈ ఏడాది ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే తొలివిడత ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, స్లాట్‌ బుకింగ్, ఫీజు చెల్లింపు తదితరం మొదలయ్యాయి. ఇందులో భాగంగా వెబ్‌సైట్‌లో వివరాల నమోదు సమయంలో ఈడబ్ల్యూఎస్‌ ఆప్షన్‌ కనిపించకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. వాస్తవానికి గతేడాదే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వచ్చినా అప్పటికే రాష్ట్రంలో ఎంసెట్‌–19 నోటిఫికేషన్‌ విడుదలై, ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ఈ ఏడాది నుంచి అమలు కావచ్చని భావించారు. ఈ క్రమంలో ఎంసెట్‌–20 దరఖాస్తు సమయంలో ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ సంఖ్యను కూడా ఆప్షన్‌గా ఇవ్వడంతో ఈసారి తప్పకుండా కోటా అమలవుతుందని అనుకున్నారు. కానీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఉత్తర్వులు విడుదల చేయలేదు. మరోవైపు కౌన్సెలింగ్‌ ప్రక్రియ సైతం ప్రారంభం కావడంతో అగ్రవర్ణ నిరుపేద విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. దరఖాస్తు పత్రం క్యాస్ట్‌ కాలమ్‌లో ఈడబ్ల్యూఎస్‌గా పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం ఓసీగా పేర్కొంటూ వివరాలు ప్రత్యక్షమవుతుండడంతో వారికి ఎంచేయాలో తోచని పరిస్థితి నెలకొంది. 

ఆ లోపు స్పష్టత వస్తే... 
ఎంసెట్‌–20 ప్రవేశాల కౌన్సెలింగ్‌ తొలివిడత శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 17వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌ తదితర ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే 18న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు తెరపడనుంది. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత విద్యార్థులు కాలేజీలు, కోర్సులు ఎంచుకుంటూ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఇది ఈ నెల 20తో ముగుస్తుంది. అనంతరం 22న సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై అస్పష్టత ఉన్నప్పటికీ సీట్ల అలాట్‌మెంట్‌ నాటికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే ఆమేరకు రిజర్వేషన్లు వర్తింపజేయవచ్చని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు