జీహెచ్‌ఎంసీ ఆస్తుల ధ్వంసం హేయం: మేయర్‌ గద్వాల విజయలక్ష్మి

24 Nov, 2021 07:56 IST|Sakshi

బీజేపీ కార్పొరేటర్లు తీరు మార్చుకోవాలి 

సాక్షి, బంజారాహిల్స్‌: బీజేపీ కార్పొరేటర్లు తమ అనుచరులతో కలిసి జీహెచ్‌ఎంసీ ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక మార్గాలు ఉన్నప్పటికీ మన కార్పొరేషన్‌ ఆస్తులను మనమే ధ్వంసం చేయడం సరికాదన్నారు. బంజారాహిల్స్‌లోని మేయర్‌ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్‌ విజయలక్ష్మి మాట్లాడారు. ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల ఆస్తిని ధ్వంసం చేయడంపై బీజేపీ కార్పొరేటర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలని, రాజ్యాంగ పరమైన పదవిలో ఉండి ఇలాంటి దాడులకు పాల్పడితే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోతుందన్నారు.
చదవండి: GHMC: రణరంగంగా మారిన మేయర్‌ చాంబర్‌..

తనను కలిసేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ రాకపోవడంపై బీజేపీ కార్పొరేటర్లు సమాధానం ఇవ్వాలన్నారు. ఆ విషయాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇలాంటి దాడులకు పాల్పడటం సరికాదన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై స్పందించి వెంటనే పరిష్కరించటంలో రాజీపడటం లేదన్నారు. తాను నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో లోతట్టు ప్రాంతాలు సందర్శించి అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఎల్బీనగర్‌ జోన్‌లోని సరూర్‌నగర్‌ ప్రాంతం ఎక్కువ ముంపునకు గురైన సందర్భంలో వెల్ఫేర్‌ అసోసియేషన్, కార్పొరేటర్లు, అధికారులతో సమీక్ష చేసి తాత్కాలిక, శాశ్వత పరిష్కార చర్యలు తీసుకున్నామని తెలిపారు.

కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో జూన్‌ 29న వర్చువల్‌ ద్వారా జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించినట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లు విన్నవించిన సమస్యలను పరిష్కరించినట్లు స్పష్టం ఆమె స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ దృష్ట్యా జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించలేకపోతున్నామని, ఈ విషయం బీజేపీ కార్పొరేటర్లకు తెలిసినప్పటికీ కావాలనే దాడి చేశారని అన్నారు.  

కార్పొరేటర్లు సహా 20 మందిపై కేసు 
ఖైరతాబాద్‌: జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుర్చీలు, పూల కుండీలు, టేబుల్, అద్దాలను ధ్వంసం చేయడంతో బీజేపీ కార్పొరేటర్లు సహా 20 మందిపై సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.   

మరిన్ని వార్తలు