అశ్వత్థామరెడ్డిపై పూర్తివిశ్వాసం ఉంది

28 Sep, 2020 04:19 IST|Sakshi

ఆయనపై తప్పుడు ప్రచారం తగదు: టీఎంయూ

ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించాలని సీఎంకు వినతి  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డిపై ఆ సంఘం పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసింది. హైదరాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ భేటీలో ఈ మేరకు చర్చించారు. అశ్వత్థామరెడ్డి సంఘం నుంచి తప్పుకుంటున్నారని, ఆయన స్థానం లో మరొకరు ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపడుతున్నారంటూ  ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంఘం రాష్ట్ర కార్యవర్గం భేటీ అయింది. కోవిడ్‌ నిబంధనల్లో మినహాయింపులు ఇస్తూ వంద మందితో సమావేశాలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు రావటంతో ఈ భేటీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీలో కార్మిక సంఘాలపై అనధికార నిషేధం విధించి కార్యకలాపాలు లేకుండా చేయటాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు కార్మికులను తీవ్రంగా వేధిస్తున్నారని, వెంటనే కార్మిక సంఘాలను మళ్లీ అధికారికంగా కార్యకలాపాలు చేపట్టేందుకు వీలు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరుతూ మరో తీర్మానాన్ని ఆమోదించారు. ప్రస్తుతం ఆర్టీసీలో కార్మిక సంఘాల పరిస్థితి సరిగా లేని తరుణంలో, అశ్వత్థామరెడ్డి తప్పుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందొద్దని సమావేశంలో నేతలు అదే సంఘంలోని మరికొందరు నేతలకు సూచించారు. ఇలాంటి పరిస్థితిలో సంఘం దృఢంగా ఉండాల్సిన అవసరం ఉందని, అందుకు అశ్వత్థామరెడ్డి నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. ఒకవేళ అశ్వత్థామరెడ్డి తప్పుకోవాలని నిర్ణయిస్తే, కార్మిక సంఘాలు పునరుత్తేజం పొందేవరకు అదే స్థానంలో ఉండాలని పేర్కొనటం విశేషం. అశ్వత్థామరెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న కొందరు నేతలు ఈ సమావేశానికి హాజరు కాలేదు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా