‘ఎస్సీ జాబితాలోకి రజకులు’ సీఎం దృష్టికి: మంత్రి హరీశ్‌రావు

14 Mar, 2022 01:48 IST|Sakshi
సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు 

రజక సంఘం ఆత్మగౌరవ సభలో మంత్రి హరీశ్‌రావు హామీ

80% సబ్సిడీపై పనిముట్లు ఇచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడి

మెదక్‌ జోన్‌: రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని, రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులకు త్వరలో ముఖ్యమంత్రితో అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తానని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఆదివారం మెదక్‌లో జరిగిన రజక సంఘం ఆత్మగౌరవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

రజక, నాయీబ్రాహ్మణుల కులవృత్తుల నిర్వహణకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు బడ్జెట్‌లో రూ. 300 కోట్లు కేటాయించామని హరీశ్‌ తెలిపారు. రజకులకు 80% సబ్సిడీపై ఇస్త్రీ పెట్టెతోపాటు ఇతర పనిముట్లు అందించేందుకు కృషి చేస్తామన్నారు. భూమి కోసం.. భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం దొరల గడీలపై దాడులు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడేలా చేసి స్వరాష్ట్రాన్ని సాధించారని చెప్పారు.

రజకులకు అన్ని జిల్లాల్లో ఆధునిక దోబీ ఘాట్‌లను నిర్మిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మంది రజకులు, నాయీబ్రహ్మణుల కులవృత్తి కోసం ఉచిత విద్యుత్‌ ఇస్తామని వివరించారు. రజక వృత్తిదారులు చెరువుల్లో బట్టలు ఉతికే క్రమంలో ప్రమాదంలో చనిపోతే వారికి బీమా ఇచ్చేందుకు జీవో తీసుకొస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. గత పాలకుల హయాంలో మూడు మెడికల్‌ కళాశాలలు ఉండగా తెలంగాణ వచ్చాక ఏడేళ్లలో జిల్లాకో మెడికల్‌ కళాశాల కట్టబోతున్నామని చెప్పారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, రజక సంఘం జాతీయ కోఆర్డినేటర్‌ మల్లేశ్‌ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల ఉప్పలయ్య, జిల్లా అధ్యక్షుడు సంగు స్వామి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్, వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు