నడి వీధిలో రైతు పరువు వేలం 

24 Mar, 2021 08:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోఆపరేటివ్‌ సొసైటీ అధికారుల దుశ్చర్య 

సాక్షి, మెదక్‌: రుణాలు చెల్లించని రైతుల పేర్లు, ఫొటోలతో నడి వీధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వారి పరువు తీశారు మెదక్ జిల్లా కోఆపరేటివ్‌ అధికారులు. జిల్లాలోని  పాపన్నపేట మండలంలో వ్యవసాయ పైపులైన్లు, గేదెలు, కోళ్ల ఫారాల ఏర్పాటు కోసం తీసుకున్న లాంగ్‌ టర్మ్‌ రుణ బకాయిల వసూళ్ల కోసం అధికారులు ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు. కరోనా కాలంలో అప్పు పుట్టక, పంటలు చేతికి రాక ఇబ్బందుల్లో ఉన్నామని, కాస్త సమయం ఇవ్వమని రైతులు వేడుకున్నా అధికారులు కనికరించలేదు. వెంటనే అప్పు కట్టకపోతే భూములు వేలం వేస్తామని, ఎర్ర జెండాలు పాతుతామని అధికా రులు బెదిరిస్తున్నారని రైతులు వాపోయారు.

గతేడాది కరోనా, భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయి చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయిందని, ఈ పరిస్థితుల్లో తమ పరువు తీసి బజారుకీడ్చడం ఎంతవరకు సమంజసమని కన్నీటి పర్యంతమవుతున్నారు. పంటలు వచ్చిన తర్వాత అప్పులు కడతామని, అప్పటి వరకు మానసికంగా చంపొద్దంటూ వేడుకుంటున్నారు. డీసీసీబీ పాపన్నపేట మేనేజర్‌ ప్రవీణను వివరణ కోరగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే బకాయిదారుల ఫొటోలతో ఫ్లెక్సీలు ప్రింట్‌ చేయించామని తెలిపారు. చాలా ఏళ్లుగా రుణాలు కట్టని, వేలానికి వచ్చిన వాటికి సంబంధించి ఫ్లెక్సీ వేశారని చెప్పారు. ఎంతో కొంత మొత్తం కడితే గడువు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, బుధవారం వరకే ఈ అవకాశం ఉందన్నారు.

చదవండి:  అనిల్‌.. 21 రోజుల్లో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించండి

మరిన్ని వార్తలు