కొత్త పంట గెర్కిన్‌.. లక్షల్లో ఆదాయం

26 Nov, 2021 13:15 IST|Sakshi

ఎవర్‌గ్రీన్‌ ఆలూ..

మూడు నెలల్లోనే చేతికి పంట 

కొత్త పంట గెర్కిన్‌.. లక్షల్లో ఆదాయం    

పంట కాలం 75 రోజులు.. 

రైతులకు భరోసా ఇస్తున్న కూరగాయల సాగు  

వరి నాటేసేటప్పుడు కూలీల కొరత.. పాలుపోసుకునే దశలో చీడపీడల బెడద.. కోసేటప్పుడు హార్వెస్టర్‌ చార్జీల మోత.. చేతికందే సమయంలో అకాల వర్షాలు.. అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాల్లో అష్టకష్టాలు.. ఇకపై యాసంగిలో ధాన్యం కొనబోమని తేల్చి చెబుతున్న ప్రభుత్వాలు.. ఈ పరిస్థితులను అధిగమించేందుకు వరి సాగు చేస్తున్న పలువురు రైతులు ఇప్పటికే లాభాలనిచ్చే ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లడమే కాకుండా మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రైతులు కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్‌ నగరానికి దగ్గరగా ఉండడంతో అమ్మడం కూడా సులభంగా ఉంటోంది. ఉమ్మడి జిల్లాలో కూరగాయల పంటలతో లాభాలు ఆర్జిస్తున్న రైతుల విజయగాథపై ప్రత్యేక కథనం.. 

ఆలు సాగుతో ఆదర్శంగా..
ఆలుగడ్డ పంట సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సల్లోల్ల నారాయణరెడ్డి. సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండలం కుప్పనగర్‌కు చెందిన ఈ రైతు తనకున్న మూడు ఎకరాలతో పాటు, మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం తొమ్మిది ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఎకరానికి 40 నుంచి 50 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

3నెలల్లో పంట చేతికి.. 
ఏటా దసరా పండగకు కాస్త అటూఇటుగా రైతులు ఆలుగడ్డ పంట వేసుకుంటారు. ప్రస్తుతం ఈ పంట పూత దశలో ఉంది. మూడు నెలల్లో ఈ పంట పూర్తిస్థాయిలో చేతికందుతుంది. కొందరు రైతులు 65 నుంచి 70 రోజుల్లోనే తవ్వుకుంటారు. మూడు నెలల వరకు ఆగితే ఎక్కువ దిగుబడి వస్తుంది. ఏటా జనవరిలో ఆలుగడ్డ తవ్వకాలు ప్రారంభమవుతాయి. 

బోయిన్‌పల్లి మార్కెట్‌లో విక్రయం 
రైతులు ఎక్కువగా ఈ పంటను హైదరాబాద్‌ మార్కెట్‌కు తరలిస్తారు. బోయిన్‌పల్లి మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఆలుగడ్డకు క్వింటాల్‌కు కనీసం రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు ధర ఉంటుంది. ప్రస్తుతం ఆలుగడ్డకు రూ.రెండు వేల వరకు ధర పలుకుతోంది. మార్కెట్‌లో ధర బాగుంటే సాగు వ్యయం పోగా, ఎకరానికి సగటున రూ.40 వేల వరకు చేతికందుతుందని రైతులు పేర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో సుమారు 3,200 ఎకరాల్లో ఆలుగడ్డ పంట సాగవుతోందని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. 

నాలుగేళ్లుగా సాగు చేస్తున్నా  
వరితో లాభంలేదని చెరకు వేసిన.. అడవిపందుల బెడదతో అదీ మానుకున్నా.. నాలుగేళ్లుగా ఆలుగడ్డ సాగుచేస్తున్నా. మార్కెట్‌లో రేటు బాగుంటే లాభాలు మంచిగుంటయి. గతేడాది ఆలుగడ్డ ధర కొంత తక్కువగా ఉండే. అంతకు ముందు మంచి ధర వచ్చింది.  
– సల్లోల్ల నారాయణరెడ్డి, ఆలుగడ్డ రైతు 

గెర్కిన్‌.. కాసుల పంట 
గెర్కిన్‌ పంట సాగు కాసుల వర్షం కురిపిస్తోంది. దోసకాయల మాదిరిగా ఉండే ఈ పంట.. మనకు కొత్త. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఇప్పగూడెనికి చెందిన రైతు కె.యాదవరెడ్డి ఈ పంట సాగుచేస్తూ లాభాలను గడిస్తున్నారు. అంతకుముందు వరి, ఇతర పంటలు వేసిన ఆయన అప్పుల పాలై.. వ్యవసాయ శాఖ ప్రోత్సాహంతో 1.2 ఎకరాల్లో గెర్కిన్‌ పంట వేశారు. వ్యవసాయ శాఖ గ్లోబల్‌ గ్రీన్‌ కంపెనీ సహకారంతో గెర్కిన్‌ విత్తనాలను ఇప్పించింది.


గెర్కిన్‌ కాయలు 

పంట కాలం 75 రోజులు. పంట కాలం ముగిసే నాటికి 23 కోతలతో కాయలను తెంచాల్సి ఉంటుంది. గ్లోబల్‌ గ్రీన్‌ కంపెనీ వారే నేరుగా రైతుల దగ్గరి నుంచి కోనుగోలుచేసి వారికి డబ్బులను బ్యాంక్‌ ఖాతాలో జమచేస్తున్నారు. యాదవరెడ్డి మొత్తం 1.2 ఎకరాల విస్తీర్ణంలో వేసిన గెర్కిన్‌ కాయలను విక్రయించగా రూ.2,33,926 వచ్చాయి. పంట ప్రారంభం నుంచి కోసే వరకు పెట్టుబడి రూ.85,500 వరకు అయ్యింది. రైతుకు ఖర్చులన్నీ పోను రూ.1,48,426 నికర ఆదాయం వచ్చింది. ఈ పంటను యాసంగిలో సాగు చేసు కోవచ్చని అధికారులు చెబుతున్నారు. 

గెర్కిన్‌ కాయలు చూసేందుకు కీరాదోసకాయల్లా ఉంటాయి. వీటిని ఇతర దేశాల్లో స్నాక్స్‌గా అధికంగా వినియోగిస్తుం డడంతో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం మనదగ్గర ఇవి వినియోగంలో లేవు. 

లాభాలు కురిపిస్తున్న కూరగాయల సాగు 
కూరగాయల సాగు ఎప్పుడూ లాభదాయకమే. అందులోనూ ఆధునిక పద్ధతిలో సాగు చేస్తే మంచి లాభాలు సొంతం చేసుకోవచ్చు. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం మమ్మద్‌నగర్‌కు చెందిన మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి అన్నదమ్ములు.. తమకున్న ఐదెకరాలతో పాటు మరో 13 ఎకరాలు కౌలుకు తీసుకుని గతంలో వరి సాగుచేసే వారు.

పంట చేతికొచ్చేదంతా దైవాధీనంగా మారడంతో 18 ఎకరాల్లో బీర, కాకర, టమాట పంటల సాగు ప్రారంభించారు. పదెకరాల్లో బీర సాగును పందిరి, డ్రిప్, మల్చింగ్‌ పద్ధతిలో సాగుచేస్తున్నారు. పందిరి ఒకసారి ఏర్పాటుచేస్తే 20 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. అలాగే కాకర పంటను 4 ఎకరాల్లో సాగు చేశారు. మరో 4 ఎకరాలలో 15 రోజుల క్రితమే టమాట వేశారు.  

బీర, కాకర సాగు ఖర్చులు
బీర సాగుకు ఎకరాకు రూ.లక్ష ఖర్చు ఉంటుంది.  
నాలుగు నెలల్లో బీర ఎకరాకు 20 నుంచి 22 టన్నుల దిగుబడి వస్తుంది.  
మార్కెట్లో హాల్‌సేల్‌ ధర కిలోకు ప్రస్తుతం రూ.25 నుంచి రూ.30 పలుకుతోంది. దీంతో ఎకరాకు రూ. 4 లక్షల ఆదాయం వస్తోంది.  
పెట్టుబడి రూ.లక్ష పోను ఎకరంలో నాలుగు నెలల కాలంలో రూ.3 లక్షల ఆదాయం మిగులుతుందని చెబుతున్నారు.  
ఇక కాకరకు ఎకరానికి పెట్టుబడి రూ. 50 వేలు ఖర్చు కాగా పెట్టుబడిపోను రూ.60వేల నుంచి 70 వేలు మిగులుతుంది. ఏడాదికి 3 పంటలు వస్తాయి. 

మరిన్ని వార్తలు