ఇంతకీ అక్కడి జనం ఏమైనట్లు ?

10 Mar, 2021 09:31 IST|Sakshi
మజీద్‌పల్లి(ఎన్‌కే) గ్రామ శివారులో నెలకొల్పిన పరిశ్రమలు

ఆనవాళ్లకే పరిమితమైన హుస్సేన్‌పూర్, మజీద్‌పల్లి (ఎన్‌కే)

రికార్డుల్లో మాత్రం రెవెన్యూ గ్రామాలుగా నిక్షిప్తం 

ప్రస్తుతం జనాభా లేని ఆవాసాలుగా గుర్తింపు 

కనిపించని పల్లెల్లో జోరుగా ‘రియల్‌’ వ్యాపారం 

రూ.కోటికి పైగా పలుకుతున్న భూముల ధరలు 

 సాక్షి, మెదక్‌/తూప్రాన్: అక్కడ ఊరు లేదు.. జనం లేరు. కానీ.. రెవెన్యూ రికార్డుల్లో ఆ గ్రామాల పేర్లు నిక్షిప్తమై ఉన్నాయి. అంతేకాదు.. ఇప్పటికీ వందల ఎకరాల భూమికి సంబంధించి  లావాదేవీలు వాటి పేరిటే కొనసాగుతున్నాయి. ఆనవాళ్లు మాత్రమే మిగిలినప్పటికీ.. ఆ భూములకు మంచి డిమాండ్‌ ఉంది. ఇంతకీ అక్కడి జనం ఏమైనట్లు అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. తూప్రాన్‌ మండలంలో రికార్డులకే పరిమితమైన రెవెన్యూ గ్రామాలు హుస్సేన్‌పూర్, మజీద్‌పల్లిపై ప్రత్యేక కథనం.. 

తూప్రాన్‌ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో హుస్సేన్‌పూర్, మజీద్‌పల్లి పేర్లు రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే ఉన్నాయి. జనంలేని ఈ రెండు పల్లెలు 1953 నుంచి రెవెన్యూ గ్రామాలుగా కొనసాగుతున్నాయి. గతంలో అల్లాపూర్‌ పంచాయతీ పరిధిలో హుస్సేన్‌పూర్‌ ఉండేది. ప్రస్తుతం అల్లాపూర్‌ తూప్రాన్‌ మున్సిపాలిటీ విలీనమైంది. మజీద్‌పల్లి(ఎన్‌కే) గ్రామం మనోహరాబాద్‌ మండలం ముప్పిరెడ్డి గ్రామ పంచాయతీ పరిధిలోకి రాగా.. రెవెన్యూ గ్రామంగా తూప్రాన్‌ మండల పరిధిలోకి వస్తోంది. హుస్సేన్‌పూర్‌ శివారులో హనుమాన్‌ విగ్రహం, రోలు ఆ గ్రామానికి ఆనవాలుగా నిలుస్తుండగా.. మజీద్‌పల్లి (ఎన్‌కే)కి సంబంధించి ఎలాంటి గుర్తులు లేవు. నిజాం కాలంలో ఈ గ్రామాల్లో జనావాసాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి ప్రజలు ఎక్కడికెళ్లారు.. ఏ కారణంతో ఊళ్లు ఖాళీ అయ్యాయి.. అని ఎవరూ చెప్పలేకపోతున్నారు.   

కనిపించని ఊళ్లలో ‘రియల్‌’ జోరు.. 
ప్రస్తుతం కనపడని.. జనం లేని హుస్సేన్‌పూర్, మజీద్‌పల్లి (ఎన్‌కే) ఊళ్లలో సాగు భూమి మాత్రమే ఉంది. గతంలో కొందరు రైతులు పత్తి, వరి, మొక్కజొన్న పంటలు పండించేవారు. ప్రస్తుతం ఈ భూములకు మంచి డిమాండ్‌ పలుకుతోంది. ఈ నేపథ్యంలో భూమిని ప్లాట్లుగా చేసి.. క్రయవిక్రయాలు జరుపుతుండడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. హుస్సేన్‌పూర్‌లో ఎకరాకు రూ.కోటికి పైగా.. మజీద్‌పల్లి (ఎన్‌కే)లో ఎకరాకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పలుకుతుండడం విశేషం. మజీద్‌పల్లి(ఎన్‌కే) గ్రామంలో 60 ఎకరాల భూమిని టీఎస్‌ఐసీసీకి కేటాయించగా.. మిగతా భూముల్లో రైతులు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.   

గతంలో ఉండేవారట 
గతంలో హుస్సేన్‌పూర్‌లో జనాభా ఉండేదని పెద్దలు చెప్పారు. వ్యవసాయమే ఆధారంగా జీవించినట్లు మా తాత చెప్పేవారు. ఇక్కడ ప్రస్తుతం ఏ ఒక్కరూ లేకపోవడం అంతుపట్టడం లేదు. ఈ గ్రామ శివారులో హనుమాన్‌ విగ్రహం, నంది విగ్రహం ఉండేది. నంది విగ్రహాన్ని ఎవరో తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎలాంటి ఆనవాళ్లు లేవు. 
జిన్న భగవాన్‌రెడ్డి, మున్సిపల్‌ 7వ వార్డు కౌన్సిలర్, అల్లాపూర్‌

ఈ గ్రామాల్లో ప్రజలెవరూ లేరు.. 
తూప్రాన్‌ మండలంలోని హుస్సేన్‌పూర్, మజీద్‌పల్లి(ఎన్‌కే) గ్రామాలు రెవెన్యూ రికార్డుల్లో దశాబ్దాలుగా ఉన్నాయి. ఈ గ్రామాలు ఇప్పడు కనిపించడం లేదు.. జనాలు కూడా లేరు. నిజాం కాలంలో ప్రజలు నివసించేవారట. ఈ భూములకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉండడంతో వెంచర్లుగా చేసి విక్రయిస్తున్నారు. కొందరు వ్యవసాయం చేసుకుంటున్నారు. 
శ్రీదేవి, తహసీల్దార్, తూప్రాన్‌  

మరిన్ని వార్తలు