Lockdown: కాలక్షేపం పేరిట కాయ్‌ రాజా కాయ్‌..

22 May, 2021 11:44 IST|Sakshi

కాలక్షేపమే కొంపముంచుతోంది. సరదాగా మొదలుపెట్టిన పేకాట వ్యసనంగా మారుతోంది. మూడుముక్కలాట సామాన్యుల జేబులను గుల్ల చేస్తోంది. కష్ట పడకుండా సంపాదించాలనే తాపత్రయంతో ఎంతో మంది ఆటకు బానిసలవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కరోనా వేళ అందరూ ఇంటిపట్టునే ఉండటంతో ఈ ఆట మరింత ఎక్కువైంది. అద్దె ఇళ్లు, నిర్మానుష్య ప్రదేశాలు పేకాట స్థావరాలకు వేదికలవుతుండగా, లక్షల్లో నగదు చేతులు మారుతోంది. జిల్లా వ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒకచోట పేకాటరాయుళ్లు పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. 
- మెదక్‌ రూరల్‌

 జిల్లాలో మూడు రాజాలు, ఆరు రాణులుగా పేకాట కొనసాగుతుంది. మూడేళ్ల పోలీస్‌ రికార్డులతో పోలిస్తే జిల్లాలో పేకాట కేసుల సంఖ్య, పట్టుబడిన వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. 2019లో 36 పేకాట కేసులు నమోదవగా, 191 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించగా, రూ.4,46,722 జరిమానా విధించారు. అదే విధంగా 2020లో మొత్తం 90 కేసులు నమోదవగా, 552 మందిని కోర్టులో హాజరుపరచగా, రూ.13,52,789 జరిమానా విధించారు. అలాగే 2021లో ఇప్పటి వరకు మొత్తం 9 కేసులు నమోదు కాగా, 57 మందిని కోర్టుకు తరలించగా రూ. 97,700లను జరిమానా విధించారు.

కొంపముంచుతున్న కాలక్షేపం.. 
జిల్లాలో లాడ్జీలు, అద్దె ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు, అటవీ, నిర్మానుష్య ప్రాంతాలను అడ్డాలుగా ఏర్పరుచుకొని యథేచ్ఛగా పేకాటను కొనసాగిస్తున్నారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా రహస్యంగా పేకాట ఆడుతుండటం వల్ల లక్షల్లో నగదు చేతులు మారుతున్నాయి. మెదక్‌ పట్టణంతో పాటు నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట, అల్లాదుర్గ్, టేక్మాల్, రేగోడ్, కౌడిపల్లి, కొల్చారం, శంకరంపేట, చేగుంట, హవేళిఘణాపూర్‌ తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా పేకాట ఆడుతున్నారు. కాలక్షపం పేరిట మొదలైన పేకాట ఎంతో మంది సామాన్యుల జీవితాలను రోడ్డుపాలు చేస్తుంది.

తనఖా పెట్టి మరీ.. 
పేకాటరాయుళ్లు తమ స్థోమతను బట్టి రౌండ్‌ రౌండ్‌కు డబ్బులను పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇలా సుమారు రూ. 20 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఆటను కొనసాగిస్తుంటారు. పేకాటలో డబ్బులను పోగొట్టుకున్న కొందరు తిరిగి ఆట ఆడి సంపాదించాలనే కోరికతో తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్లను, వాహనాలతో పాటు ప్రాపర్టీ డాక్యుమెంట్లను సైతం వడ్డీ వ్యాపారుల వద్ద తనఖా పెట్టి ఆటను కొనసాగిస్తూ సర్వం కోల్పోతున్నారు. ఇంకొందరు ఆటకు అవసరమైన డబ్బుల కోసం ఇంట్లో తల్లిదండ్రులు, భార్య పై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు పేకాటకు బానిసలుగా మారి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. 

కరోనా వేళ పెరిగిన ఆట..
కరోనా పేకాటరాయుళ్లకు కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో వ్యాపారాలు అంతంత మాత్రంగానే జరగడం, స్కూళ్లు, కాలేజీలు మూతపడగా, ఆయా శాఖల కార్యాలయాలు అడపాదడపా కొనసాగుతున్నాయి. కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లతో పేకాటరాయుళ్లకు కావాల్సినంత సమయం దొరుకుతుంది. దీంతో కొందరు గుంపులుగా ఒక చోటకు చేరి అడ్డూఅదుపు లేకుండా పేకాటను కొనసాగిస్తున్నారు. పోలీసుల కళ్లు కప్పి తమ స్థావరాలను మార్చుకుంటూ రహస్యంగా పేకాటను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు ప్రత్యేక దృష్టిసారించి పేకాటను నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

చట్టరీత్యా చర్యలు తప్పవు.. 
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పోలీసు ప్రత్యేక బృందాలు, సిబ్బంది పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలుచోట్ల పేకాట స్థావరాలను గుర్తించడంతో పాటు పేకాట, బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వ్యక్తుల పై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇలాంటివి ఏమైనా ప్రజల దృష్టికొస్తే 100 డయల్‌ చేయాలి లేదా దగ్గరలోని పోలీసులకు తెలియజేయాలి. సమాచారం ఇచి్చన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. 
- చందనాదీప్తి, ఎస్పీ 

మరిన్ని వార్తలు