‘మమ్మల్ని వెలివేశారు.. న్యాయం చేయండి’

19 Jan, 2021 12:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నిజాంపేట(మెదక్‌): ‘మేము వేరే కులం వారిని పెళ్లి చేసుకున్నందుకు మమ్మల్ని కులం నుంచి వేలివేశారు. మాకు న్యాయం చేయాలని మండల పరిధిలోని రజాక్‌పల్లి గ్రామానికి చెందిన చిందం రాములు సోమవారం విలేకరులతో మొరపెట్టుకున్నాడు. వివరాలు ఆయన మాటల్లోనే.. 30 ఏళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన వేరే కులం అమ్మాయి అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ప్రస్తుతం నా కుమారుడు వేణు సైతం నా భార్య అన్న కూతురు మమతను ప్రేమించి జనవరి ఒకటిన వివాహం చేసుకున్నాడు. ఇలా వేరే కులం వారిని పెళ్లి చేసుకున్నందుకు మమ్మల్ని మా కులం వారే ఏ కార్యక్రమానికి పిలవడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారని పంచాయతీ పెడితే మేము మీ ఇంటికి రాము.. మీరు మా ఇంటికి రావొద్దని తేల్చి చెప్పారు’ అని తెలిపాడు. 

‘రెండు, మూడు రోజుల క్రితం మా అక్క తరఫున బంధువు మరణిస్తే మమ్మల్ని, మా అక్క, భావలను కూడా అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా మా కులంలో నుంచి ఎవరైనా మా ఇంటికి వస్తే వారికి రూ.లక్ష జరిమానా విధిస్తామని మాట్లాడుకున్నట్లు తెలిసింది. ప్రేమ వివాహం చేసుకున్నందుకు మమ్మల్ని వేలివేస్తారా? మాకు న్యాయం చేయాలని’ మీడియాతో వారు తమ బాధను వెలిబుచ్చారు. ఈ విషయమై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదని తెలిపాడు.

మరిన్ని వార్తలు