జాతర సందడిలో పురాత్మల ఆవహయామీ.. తంత్రగాళ్ల ప్రత్యేక పూజలు

17 Feb, 2022 12:29 IST|Sakshi

జాతర సమయంలో మేడారానికి లక్షల మంది భక్తులు వస్తారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా  పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.  నూటికి 99 శాతం మంది తమ కోరికలు తీర్చాలని, తమ మొక్కులు చెల్లించుకునేందుకు వస్తారు.  కానీ కొద్ది మంది తంత్ర సాధన కోసం మేడారం చేరుకుంటారు.

మేడారంలో ప్రతీ మలుపులో కనిపించే వన మూలికలు అమ్ముకునే వారు కనిపిస్తారు. శరీరం నిండా చిత్రమైన అలంకరణ చేసుకుంటారు. వీరిని  తంత్ర గాళ్లు అనుకుని చాలా మంది పొరపాటు పడతారు. వనమూలికలు, అటవీ జంతువుల శరీర అవయవాలను అమ్మేవాళ్లు విచిత్ర వేషధారణతో జాతర ప్రాంగణంలో కలియతిరుగుతూ ఉంటారు. వన మూలికలు అమ్మడమే వీరి ప్రధాన జీవనోపాధి, అయితే ప్రజలను ఆకట్టుకునేందుకు వీరు కొంచెం అతిగా అలంకరించుకుంటారు. నిజానికి వీరికి ఇటు మేడారం జాతరతోకానీ అటు తంత్ర గాళ్లతో గానీ ఎటువంటి సంబంధం ఉండదు.

తంత్ర సాధన కోసం మేడారం వచ్చే వాళ్లు జాతర జరిగే సమయంలో మేడారం అడవుల్లో ప్రత్యేక సాధన చేస్తారు. భక్తుల కోలాహాలం లేని అడవుల్లోని నిర్మాణుష్యమైన ప్రాంతాల్లో వీరి సాధన జరుగుతుంది. జాతర ఘడియల కోసం ఎంతో మంది రోజుల తరబడి ఎదురు చూస్తుంటారు.

తంత్ర సాధనకు అవసరమయ్యే వివిధ రకాల చెట్లు, జంతువులు.. ఇతరాలు బయట లభించడం చాలా కష్టం. ఒక్కో వస్తువు ఒక్కో చోట లభిస్తుంది. కానీ జాతర సందర్భంగా వేర్వేరు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఇక్కడ కలుసుకుంటారు. తంత్ర సాధనలో ఉపయోగించే వస్తువులు సులువుగా లభ్యమవుతాయి.

మరోవైపు జాతర సందర్భంగా మహిమాన్వితులు, వీరుల ఆత్మలు మేడారం చేరుకుంటాయని ఈ తంత్రగాళ్ల నమ్మకం. అందుకే ఆ మహిమాన్విత ఆత్మలను ఆవహయామి చేసుకునేందుకు వారు సాధన చేస్తారు. వీరిని సాధారణ భక్తులు గుర్తించడం కష్టం. 

అయితే ఈ తంత్ర సాధనలో వారు ఏం ప్రయోజనం పొందుతారనేది ఇప్పటికీ రహస్యమే. జాతర సందర్భంగా మేడారం అడవుల్లో తంత్ర సాధన చేసే వాళ్లలో ఎక్కువ మంది చత్తీస్‌గడ్‌, ఓడిషా, ఝార్ఖండ్‌, మహారాష్ట్రలకు చెందిన వారు ఉంటారు. 

మరిన్ని వార్తలు