20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు

4 Jul, 2022 15:18 IST|Sakshi
కండ్లకోయ గేట్‌వే ఐటీ పార్కు నమూనా చిత్రం

మాదారంలో పూర్తయిన భూసేకరణ

నగర శివారులో అన్ని సానుకూల పరిస్థితులే..

పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్న పారిశ్రామికవేత్తలు 

సాక్షి, మేడ్చల్‌జిల్లా: నగర శివారు మేడ్చల్‌ జిల్లా పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. వందలాది పరిశ్రమల ఏర్పాటుతో వేలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, లక్షలాది కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌ హైదరాబాద్‌ కు తూర్పు దిశలో ఉన్న ఘట్‌కేసర్‌ మండలం మాదారంలో కొత్తగా ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటునకు తొలి అడుగుపడింది. 

150కి పైగా కంపెనీల స్థాపన.. 
శివారుల్లో ఇప్పటికే గ్రీడ్‌ పాలసీలో భాగంగా ఉప్పల్‌ జెన్‌ప్యాక్‌ వద్ద 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు స్థాపనకు పునాది రాయి పడింది. నగరానికి ఉత్తరం వైపు కండ్లకోయలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గేట్‌వే ఐటీ పార్కుకు శ్రీకారం చుట్టారు. ఈ రెండు పార్కుల ఏర్పాటుతో 150కి పైగా సంస్థలు తమ కార్యకలాపాలను స్థాపించేందుకు ముందుకు వచ్చాయి. 

భూ పరిహారం సైతం చెల్లింపు... 
గ్రేటర్‌కు తూర్పు దిశలో ఘట్కేసర్‌ మండలం మాదారంలో త్వరలో ఇండస్ట్రీయల్‌ పార్కు ఏర్పాటు కానుండటంతో... జిల్లా నిరుద్యోగ యువతలో ఉపాధిపై ఆశలు చిగురించాయి. ఈ పార్కు స్థాపనకు రైతుల అంగీకారంతో 226 ఎకరాల భూ సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన అధికార యంత్రాంగం వారికి చెల్లించాల్సిన భూ పరిహారాన్ని కూడా అందజేసింది. జిల్లా పరిశ్రమల శాఖ కూడా టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటునకు అన్నీ అనుమతులు ఇప్పించింది. 

భూ నిధి ఎక్కువే... 
నగర శివారు మేడ్చల్‌ జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు తగినంత భూనిధి ఉంది. జిల్లా పరిధిలో 66.8 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 65 కిలోమీటర్ల రాష్ట్రీయ రహదారులు ఉన్నాయి. వీటికి తోడు ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఉండటంతో కొత్త పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతంగా పారిశ్రామికాధిపతులు భావిస్తున్నారు. రహదారుల సమీపంలో దాదాపు 10వేల ఎకరాల భూములు ఉన్నాయి. అందులో 6,084 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 

కొత్తగా 5వేల ఉద్యోగాలు  
మేడ్చల్‌ జిల్లాలో కరోనా కష్టకాలం (2021–22 ఆర్థిక సంవత్సరం)లో రూ34.95 కోట్ల పెట్టుబడులతో కొత్తగా 685 పరిశ్రమలు ఏర్పడగా, 5,536 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. దీంతో పరోక్షంగా జిల్లాలో వందలాది మందికి ఉపాధి దక్కుతోంది.

పరిశ్రమల స్థాపనతో 1.93 లక్షల ఉద్యోగాలు 
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మేడ్చల్‌ జిల్లాగా ఏర్పడిన తర్వాత 2016 అక్టోబర్‌ నుంచి 2021 మార్చి వరకు ఐదేళ్ల కాలంలో రూ.14,762 కోట్ల పెట్టుబడులతో 8,461 సూక్ష్మ, చిన్న, మధ్యతరహ, భారీ పరిశ్రమలు ఏర్పడ్డాయి. తద్వారా 1,93,050 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. (క్లిక్: ఈవీ చార్జింగ్‌ స్టేషన్లొస్తున్నాయ్‌..)

మరిన్ని వార్తలు