వైద్య పరికరం పాడైతే ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు

24 Aug, 2022 02:36 IST|Sakshi

వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం

నిర్ణీత సమయంలోగా బాగు చేసేలా ఏజెన్సీలకు ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: మీరు వెళ్లిన ప్రభుత్వాస్పత్రిలో ఎక్స్‌రే మెషీన్‌ పనిచేయడం లేదా? బయట ఎక్స్‌రే తీయించుకోమని చెబుతున్నారా? ఇటువంటి డయాగ్నొస్టిక్‌ దళారుల దందాకు చెక్‌ చెప్పేలా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి పరికరం పాడైపోయినా ఎవరైనా సరే వెంటనే ఫిర్యాదు చేసేందుకు 8888 526666 నంబర్‌ను అందుబాటులోకి తీసుకొ చ్చింది. రాష్ట్రంలో తొలిసారిగా రూ.20 కోట్లతో ‘బయో మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ మెయింటెనెన్స్‌’పేరుతో వైద్య పరికరాల నిర్వహణకు విధానాన్ని వైద్య ఆరోగ్యశాఖ రూపొందించింది. 

ఇందులోభాగంగా వైద్య పరికరాల నిర్వహణకు ప్రత్యేకంగా ప్రోగ్రాం మానిటరింగ్‌ యూనిట్‌ (పీఎంయూ)ను తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ)లో ఏర్పాటు చేసింది. వైద్య పరికరాల వివరాలన్నీ వెబ్‌ పోర్టల్‌లో నమోదై ఉంటాయి. అవి ప్రస్తుతం ఏ ఆస్పత్రుల్లో ఉన్నాయి.. తయారీ తేదీ...వారంటీ తేదీ...గతంలో జరిగిన మరమ్మతుల వివరాలు, ప్రస్తుత మెయింటెనెన్స్‌ కాంటాక్ట్‌ వివరాలు అందులో ఉంటాయి.

రూ.5 లక్షలకు పైగా విలువైన అన్ని రకాల వైద్య పరికరాలు ఏవైనా పాడైతే వెంటనే డాక్టర్‌ కానీ, రోగికానీ ఇతరులెవరైనా https://emmstelangana.uat. dcservices.in/ లేదా 8888 526666 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందగానే పీఎంయూ సంబంధిత రిపేర్‌ కాంట్రాక్ట్‌ ఏజెన్సీకి సమాచారం అందించి, నిర్ణీత సమయంలోగా మరమ్మతు చేయిస్తుంది. అనంతరం ఆ వైద్య పరికరం బాగైనట్లుగా పీఎంయూలో కనిపిస్తుంది. ఏజెన్సీ నిర్ణీత సమయంలోగా మరమ్మతు చేయని పక్షంలో టెండర్‌ అగ్రిమెంట్‌ ప్రకారం చర్యలు తీసుకుంటారు.  

మరిన్ని వార్తలు