ఉచితంగానే మందులు... బయట కొనొద్దు

24 Aug, 2022 02:29 IST|Sakshi

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగానే అవసరమైనన్ని మందులు

వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం

అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు

12 జిల్లాల్లో సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుప త్రులకు వచ్చే రోగులకు అవసరమైన మందులు అన్నింటినీ ఉచితంగా ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్‌ మందులు రాశాక రోగులకు నిర్దేశిత రోజులకు అవసరమైనన్ని మందులు కాకుండా తక్కువ రోజులకు ఇస్తున్న పరిస్థితి ఉంది.

దీంతో ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక చాలామంది రోగులు ప్రైవేట్‌ మందుల దుకాణాల్లో ఔషధాలు కొనుగోలు చేస్తున్నారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోగులకు అవసరమై నన్ని మందులను ఉచితంగానే ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మొదలు ఏరియా, సామాజిక, జిల్లా, బోధనాసుపత్రుల వరకు అన్ని చోట్లా దీన్ని అమలు చేస్తారు. వైద్యులు అక్కడుండే మందులనే రాసి రోగులు బయట కొనే పరిస్థితి లేకుండా చూడాల్సి ఉంటుంది.

ఇన్‌పేషెంట్లు, ఔట్‌ పేషెంట్లు అందరికీ నిర్ణీత కోర్సు మేరకు మందులు ఇస్తారు. ఉదాహరణకు ఒక రోగికి బీపీ మాత్రలు నెల రోజులకు రాస్తే, ఇప్పటివరకు వారం రోజులకు సరిపోయేలా ఇచ్చేవారు. ఇకపై నెల రోజులకూ ఇవ్వనున్నారు. ప్రభుత్వం మందుల కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ నిధులు పూర్తిస్థాయిలో రోగులకు మందులు ఇచ్చేందుకు సరిపోతాయని వైద్య వర్గాలు వెల్లడించాయి.

12 జిల్లాల్లో సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్స్‌
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో అవసరమైనన్ని మందులను అందుబాటులో ఉంచాలంటే ఆ మేరకు పంపిణీ కూడా చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం ఆలస్యం కాకుండా మందులను సరఫరా చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాలకు సరఫరా చేసేలా 12 జిల్లాల్లో సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిల్లో మూడు నెలలకు సరిపడా మందులు ఎల్లప్పుడూ నిల్వ ఉంటాయి.

ఎప్పటికప్పుడు మూడు నెలల బఫర్‌ స్టాక్‌ను నిర్వహించాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద రూ.43.20 కోట్ల నిధులతో 2022–23లో సిద్దిపేటలోని బోధనాసుపత్రి, వనపర్తి, మహబూబాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తారు. 2023–24 సంవత్సరంలో కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, భువనగిరి, గద్వాల జిల్లా ఆసుపత్రుల్లో, వికారాబాద్‌ ఏరియా ఆసుపత్రిలో, సూర్యాపేట బోధనాసుపత్రిలో నెలకొల్పుతారు. ఒక్కో సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌ ఏర్పాటుకు రూ.3.60 కోట్ల చొప్పున కేటాయించారు. ఈ స్టోర్ల నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఎలాంటి జాప్యం లేకుండా మందులు సరఫరా అవుతాయి.

మరిన్ని వార్తలు