-

రానున్న మూడు నెలలూ గడ్డురోజులే! 

7 Apr, 2021 04:44 IST|Sakshi

గతేడాది కంటే మూడింతల కేసులు పెరుగుతాయ్‌ 

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల అంచనా

ఆసుపత్రుల ప్రతినిధులతో డాక్టర్‌ శ్రీనివాసరావు భేటీ  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా విజృంభణ నేపథ్యంలో మరో మూడు నెలల పాటు గడ్డు రోజులే ఉంటాయని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. గతేడాది కంటే ఈసారి మూడింతల కేసులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో తీవ్రంగా కేసులు పెరుగుతాయని, గతేడాది ఆయా నెలలతో పోలిస్తే అవి మూడింతలు ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమావేశమై పరిస్థితిని అంచనా వేశారు. వైరస్‌ వ్యాప్తి, విస్తరణ తీవ్రత ఊహకు అందని విధంగా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు మొత్తం యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. కరోనా వ్యాక్సినేషన్‌ను వేగంగా చేపట్టాలని ఆదేశించారు.

టెస్టింగ్, ట్రాకింగ్‌ చేయడంతోపాటు హోం ట్రీట్మెంట్‌ కిట్లను పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. టెస్టులు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రాంతాల వారీగా చేపట్టాలని, కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ప్రారంభించాలని, అన్ని ఆసుపత్రులను కోవిడ్‌ చికిత్స కోసం సిద్దం చేయాలని పేర్కొన్నారు. అలాగే ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించేలా, మాస్క్‌లు ధరించేలా చర్యలు చేపట్టాలని స్పష్టంచేశారు. మరోవైపు 15 లక్షల హోం ఐసోలేషన్‌ కిట్లను సిద్దం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ)ని ప్రభుత్వం ఆదేశించింది. తొలుత సగం, తర్వాత సగం సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఇప్పటివరకు 4 లక్షల కిట్లు సిద్ధమైనట్లు సమాచారం. 

ప్రైవేట్‌లో 50 శాతం పడకలు కరోనాకే... 
ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో 50 శాతం పడకలను కరోనా చికిత్సల కోసం కేటాయించాలని వైద్య, ఆరోగ్యశాఖ కోరింది. ప్రస్తుతం ఆయా ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలకు 20 శాతం, ఇతర సాధారణ చికిత్సలకు 80 శాతం పడకలు కేటాయించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో బెడ్స్‌ కోసం వేచి ఉండాల్సి వస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల సంఘాల ప్రతినిధులతో ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు భేటీ అయ్యారు. కనీసం సగం పడకలను కరోనా రోగులకు, మిగిలిన సగం సాధారణ వైద్య సేవలకు కేటాయించాలని సూచించారు.

ఎలెక్టివ్‌ సర్జరీలను కనీసం మరో 3 నెలల పాటు వాయిదా వేసుకోవాలన్నారు. ఆసుపత్రిలో చేరిక అవసరమని కచ్చితంగా భావిస్తేనే పడక కేటాయించాలని స్పష్టంచేశారు. ఐసోలేషన్లో ఉండాల్సిన రోగులకు గతంలో మాదిరిగా కొన్ని ఎంపిక చేసిన హోటళ్లలో గదులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కరోనా బాధితుల చికిత్సలకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులనే వసూలు చేయాలని తేల్చిచెప్పారు. 20 పడకలున్న చిన్నపాటి ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలను ప్రారంభించుకోవచ్చని ఆయన తెలిపారు. 

చదవండి: కరోనా వ్యాప్తి: స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్‌ బంద్‌

మరిన్ని వార్తలు