కరోనా డేంజర్‌ బెల్స్‌.. ‘ఫోర్త్‌ వేవ్‌’ మొదలైందా? 

14 Jun, 2022 01:11 IST|Sakshi

కరోనా కేసుల వృద్ధి నేపథ్యంలో ఇప్పటికే వచ్చేసి ఉంటుందన్న అంచనాల్లో వైద్యనిపుణులు 

మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక నుంచే 81 శాతం కేసులు 

దాదాపుగా అన్ని ఒమిక్రాన్‌ బీఏ.2 సబ్‌ వేరియెంట్‌ కేసులే.. 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో కరోనా ‘ఫోర్త్‌ వేవ్‌’మొదలైందా? ప్రస్తు తం మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కసారిగా పెరుగుతున్న కేసులను బట్టి చూస్తే మనం ఫోర్త్‌వేవ్‌లోకి అడుగుపెట్టినట్టుగానే భావించాల్సి ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. గత 3,4 రోజులుగా దేశవ్యాప్తంగా నమోదైన వాటిలో ఈ 4 రాష్ట్రాల నుంచే 81 శాతం కేసులున్నట్టు ప్రభుత్వ గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది.

గత రెండు వారాలుగా కేసులు పెరుగుతున్న నేప థ్యంలో అప్రమత్తం కావాలంటూ రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్‌ టెస్టింగ్‌ పెంచడంతోపాటు ఇన్‌ఫ్లుయెంజా వంటి అనారోగ్యాలపై పర్యవేక్షణ పెంచాలని, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లపై అప్రమత్తంగా ఉండాలని, 

టెస్ట్‌ శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఎక్కడ కూడా జాగ్రత్తలు పాటించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాకాలం మొదలవుతున్నందున మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఒమిక్రాన్‌ బాధితులకు మరోసారి ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశం 
ప్రస్తుత కరోనా కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ కారణం. దీని బీఏ.2 సబ్‌వేరియెంట్‌(గత జనవరిలో థర్డ్‌వేవ్‌ కారకం) కారణమని దాదాపు అన్ని శాంపిళ్ల సీక్వెన్సింగ్‌ను బట్టి స్పష్టమవుతోంది. అందువల్ల వేరియెంట్‌ మార్పు చోటుచేసుకోలేదు. దీంతోపాటు మరో సబ్‌ వేరియెంట్‌ ‘బీఏ.2.12.1’అనేది యూఎస్‌లో బయటపడింది. గతంలోని ఒమిక్రాన్‌ సబ్‌వేరియెంట్ల కంటే కూడా ఇది 25 శాతం ఎక్కువ ఇన్ఫెక్షన్‌ కలుగజేస్తోంది. గతంలో ఒమిక్రాన్‌తో కోవిడ్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడినవారు ఈ సబ్‌వేరియెంట్‌తో మరోసారి ఇన్ఫెక్షన్‌ బారినపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

కేసులు తగ్గాక ఒక్కసారిగా మళ్లీ పెరుగుదల నమోదవుతున్న విషయంలో మనం యూఎస్‌ను, ‘బీఏ.2.12’వేరియెంట్‌తో సహా అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీలో ప్రస్తుతం ఈ కేసులు ‘అప్పర్‌ రెస్పిరేటరీ ట్రాక్ట్‌’కే పరిమితం కావడం వల్ల సెకండ్‌ వేవ్‌లో మాదిరిగా న్యూమోనియా, ఒక్కసారిగా ఆక్సిజన్‌ శాచురేషన్‌ తగ్గిపోవడం, ఐసీయూలో చేర్చడం వంటి సీరియస్‌ సమస్యలకు దారితీయకపోవడం సానుకూల అంశం. 
=డాక్టర్‌ జీసీ ఖిల్నానీ, ఎయిమ్స్‌ మాజీ పల్మనాలజీ హెడ్, చైర్మన్‌– పీఎస్‌ఆర్‌ఐ ఢిల్లీ  

ఊపిరితిత్తులు ప్రభావితమైన కేసులు కూడా వస్తున్నాయి.. 
గత రెండు, మూడురోజులుగా ఇక్కడా కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. వేసవి సెలవులకు ఛార్‌దామ్, ఈశాన్య రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చినవారిలో కొందరు అనారోగ్యం బారినపడుతున్నారు. రోజూ వచ్చే పేషెంట్లు 10, 20 మందిలో ఒకటి లేదా రెండు పాజిటివ్‌ కేసులొస్తున్నాయి. వీరిలో ఎక్కువమంది గొంతునొప్పి, ఒళ్లునొప్పులు, హైఫీవర్, డయెరియా వంటి గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ లక్షణాలు, కడుపు ఉబ్బరం, మలబద్ధకం తదితర సమస్యలతో వస్తున్నారు. వీటిలో సీజనల్‌ వైరల్‌ ఇన్ఫెక్షన్లే అధికం. కొన్ని కోవిడ్‌ కేసులుంటున్నాయి.

థర్డ్‌వేవ్‌లో మాదిరిగా స్వల్పలక్షణాలతో పారాసిటమాల్, దగ్గుమందులతోనే తగ్గిపోతున్నాయి. ఒకటి, రెండు కేసులు సెకండ్‌ వేవ్‌లో మాదిరిగా ఊపిరితిత్తులు ప్రభావితమైనవి కూడా వచ్చాయి. ర్యాపిడ్‌ టెస్టింగ్‌ రెండుసార్లు చేసినా నెగిటివే వచ్చింది. ఇది కొంచెం ఆందోళనకరమే. ముంబై, ఢిల్లీ వంటి చోట్లా కేసులు పెరుగుతున్నందున ఇక్కడా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే మాత్రం మన దగ్గరా ఫోర్త్‌వేవ్‌ ఏమైనా మొదలైందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.  
=డాక్టర్‌ వీవీ రమణప్రసాద్, పల్మనాలజిస్ట్, స్లీప్‌ డిజార్డర్స్‌ స్పెషలిస్ట్, కిమ్స్‌ ఆసుపత్రి    

మరిన్ని వార్తలు