పరికరాలు గబ్బు..నిర్లక్ష్యమే జబ్బు..!

12 Dec, 2021 03:42 IST|Sakshi
కరీంనగర్‌లో వృథాగా ఉన్న అనస్థీషియా వర్క్‌ స్టేషన్‌

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్రంలోని పలు ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన కొనుగోలు చేసిన వైద్య పరికరాలు మూలన పడుతున్నాయి. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఖరీదైన పరికరాలను ఇస్తుంటే వాటిని వినియోగంలోకి తేవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. కార్పొరేట్‌స్థాయి వైద్యాన్ని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. ప్రభుత్వంతోపాటు దాతలు సైతం వైద్యపరికరాలు అందించారు. అయితే ఎన్ని రూ.కోట్లు ఖర్చుచేసినా అవి క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. వైద్య పరికరాలను ఆస్పత్రి సిబ్బంది మూలన పడేసి కమీషన్ల కోసం ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్‌ చేస్తుండటంతో ప్రజలు ఆర్థిక దోపిడీకి గురవుతున్నారు.  

సూర్యాపేటలో మూసి ఉన్న సీటీ స్కాన్‌ గది
సూర్యాపేటలో మూసి ఉన్న సీటీ స్కాన్‌ గది
  
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితోపాటు హుజురాబాద్, జమ్మికుంట, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, గోదావరిఖనిలో ప్రధాన ఆసుపత్రులు ఉన్నాయి. నిరుపేదలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం అత్యాధునిక పరికరాలను సమకూర్చింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.3 లక్షల విలువైన ఏబీజీ మిషన్‌ను మూలన పడవేయగా, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ తన పుట్టిన రోజు సందర్భంగా అనెస్థీషియా వర్క్‌స్టేషన్‌ మిషన్‌తోపాటు 3 వెంటిలేటర్లు, సీ–పాప్‌ మిషన్, సీటీజీ మిషన్, రెండు ఫెటల్‌ డాప్లర్స్, హిస్ట్రోస్కోప్‌ విత్‌ హైడ్రోజెట్, ఐదు ఇన్‌ఫ్యూజన్‌ పంప్స్, రెండు అల్ట్రాసౌండ్‌ మిషన్‌లను అందజేశారు. సుమారు రూ.50 లక్షల విలువైన పరికరాలను ఐదు నెలలైనా వినియోగంలోకి రాలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాసుపత్రికి అదానీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ గత రెండేళ్లలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద రూ. 1.20 కోట్ల విలువైన పరికరాలు అందజేసింది. జిల్లా ఆసుపత్రిలో ఆర్థో, జనరల్, ఈఎన్‌టీ, పల్మనాలజీ, ఆప్తో విభాగాలకు చెందిన సర్జన్లు లేకపోవడంతో విలువైన పరికరాలను పక్కన పెట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని మార్చురీలో ఉన్న రెండు డెడ్‌బాడీ ఫ్రీజర్లు సాంకేతిక సమస్యలతో మూలకు పడ్డాయి. 
 
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయోగ్నోస్టిక్‌లో అడ్వాన్స్‌ బయోకెమికల్‌ ఎనలైజర్, పాథా లజీ ఎనలైజర్, సెల్‌ కౌంటర్, యూరిన్‌ ఎనలైజర్, 2డీ ఎకో, సీబీపీ, యూరియా క్రియోటిన్, లివర్‌ ఫంక్షన్‌ మెషీన్‌ అందుబాటులోకి తెచ్చారు. దీంట్లో 2డీ ఎకో మిషన్‌ ఆపరేటింగ్‌ చేయడానికి కార్డియాలజిస్ట్‌తోపాటు టెక్నీషియన్‌ లేకపోవడంతో వాడకంలో లేదు. 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో రూ.కోటికిపైనే వెచ్చించి ఆరు నెలల క్రితం సీటీ స్కానర్‌ను తెచ్చారు. ఒకట్రెండు నెలల పాటు పనిచేసిన ఈ స్కానర్‌ ఇప్పుడు మూలనపడింది.  

 ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్లేట్‌లెట్‌ పరికరాల యంత్రం రెండేళ్లయినా వినియోగంలోకి తేలేదు. దీనికి సంబంధించి కెమికల్‌ అందుబాటులో లేకపోవడంతో వినియోగించడం లేదని ఆస్పత్రి అధికారులు తెలిపారు. రూ.2.80 లక్షలతో కొనుగోలు చేసిన ఈ యంత్రంతో వివిధ రక్తపరీక్షలు కూడా చేయొచ్చు. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జనగాం, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాగ్నోస్టిక్‌ కేంద్రాలను ప్రారంభించారు. జనగామ డయాగ్నొస్టిక్‌ కేంద్రంలో మొత్తం 57 రకాల టెస్టులకుగాను, 33 రకాల టెస్టులే చేస్తున్నారు. ఎలక్ట్రోలైట్స్, డెంగీ, వైడల్‌ టెస్టులు అందుబాటులో లేవు. మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి భురాన్‌పురం సర్పంచ్‌ మచ్చా శ్రీనివాసరావు రూ.15 లక్షల విలువైన ఎక్స్‌రే యంత్రం ఇచ్చినప్పటికీ టెక్నీషియన్‌ లేకపోవడంతో ఉదయం 9 గంటలకు మొక్కుబడిగా తీసి తర్వాత మూసివేస్తున్నారు. మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్‌ బాక్స్‌ నిర్వాహణ మరిచారు. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌లో సేవలు అరకొరగానే అందుతున్నాయి.  

 కేసులను మాత్రమే రెఫర్‌ చేస్తున్నాం
కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రికి రోజూ రోడ్డు ప్రమాదాల కేసులతోపాటు ఇతర రిస్క్‌ కేసులూ వస్తుంటాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి పేషెంట్లు వస్తుంటారు. ప్రమాదాల్లో బాడీ క్రష్‌ అయిన హైరిస్క్‌ కేసులను మాత్రమే పెద్దాసుపత్రులకు రెఫర్‌ చేస్తున్నాం. మిగతా కేసులకు ఇక్కడే వైద్యం అందిస్తున్నాం. ఎలాంటి నిర్లక్ష్యం లేదు.  

మరిన్ని వార్తలు