‘సారీ.. మమ్మీ, డాడీ, అన్నయ్యా’

1 Apr, 2023 08:40 IST|Sakshi

వైద్య విద్యార్థి బలవన్మరణం 

హాస్టల్‌ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య 

నిజామాబాద్‌ ప్రభుత్వ కళాశాలలో 

ఎంబీబీఎస్‌ సెకండియర్‌ చదువుతున్న సనత్‌ 

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు 

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మోసం సనత్‌ (22) గురువారం రాత్రి హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం స్నేహితులతో కలిసి సినిమా చూసి, అర్ధరాత్రి వరకు వారితో కలిసి చదువుకున్న సనత్‌.. ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనేది తెలియరాలేదు. 

అతనికి ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలూ లేవని తల్లిదండ్రులు చెప్పగా, ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ తెలిపారు. తనొక్కడి నంబర్‌ మాత్రమే ఉన్న వాట్సాప్‌ గ్రూప్‌లో తల్లిదండ్రులకు, అన్నయ్యకు సారీ చెబుతూ మెసేజ్‌ పెట్టాడు తప్ప, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నదీ వెల్లడించ లేదు. అయితే కొద్దిరోజుల ముందు కూడా అతను ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు మెసేజ్‌ను బట్టి తెలుస్తోంది. కాగా పది నెలల్లో ఈ కళాశాలకు చెందిన ముగ్గురు వైద్య విద్యార్థులు మరణించడం కలకలం రేపుతోంది. సనత్‌ మృతిపై కళాశాల వర్గాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపిన 

వివరాలు ఇలా ఉన్నాయి.. 
సినిమా చూసి..కలిసి చదువుకుని..: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో నివసించే మోసం రమేశ్, సుజాత దంపతులకు సనత్‌ రెండో కుమారుడు. రమేష్‌ సింగరేణి ఆర్‌జీ–3 ఏరియాలోని ఓసీపీ–2లో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. కాగా సనత్‌కు పది రోజుల క్రితమే థియరీ పరీక్షలు పూర్తి అయ్యాయి. శనివారం నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన ఇద్దరు రూంమేట్స్‌తో కలిసి కూలర్‌ ఉన్న మరో గదిలోకి వెళ్లి అర్ధరాత్రి 2 గంటల వరకు చదువుకున్నాడు. తర్వాత ఒక్కడే గదికి తిరిగి వచ్చాడు. ఉదయం 5 గంటలకు గదికి వచి్చన స్నేహితులు, డోర్‌ కొట్టినా స్పందన లేకపోవడంతో బలవంతంగా తెరిచారు. బెడ్‌ïÙట్‌తో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న సనత్‌ చనిపోయి కని్పంచాడు. గురువారం అర్ధరాత్రి వరకు తమతో కలిసి గడిపిన సనత్‌ తెల్లవారేసరికి విగతజీవిగా మారడంతో సహచర విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. వెంటనే అక్కడికి చేరుకున్న కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది.. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. 

ఒత్తిడితోనే ఆత్మహత్య: ప్రిన్సిపాల్‌ 
ఒత్తిడి కారణంగానే సనత్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్‌ ఇందిర తెలిపారు. తెల్లవారుజామున 5 గంటల లోపు ఉరి వేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారు. ఫింగర్‌ ప్రింట్స్‌తో ఫోన్‌ లాక్‌ ఓపెన్‌ చేశామని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వస్తే అనుమానాలు నివృత్తి అవుతాయన్నారు. 

10 నెలల్లో ముగ్గురి మృతి 
ఇదే కళాశాలకు చెందిన శ్వేత అనే పీజీ ఫైనలియర్‌ విద్యార్థిని 2022 మే 13న అనుమానాస్పద స్థితిలో శవమై కని్పంచింది. చదువులో చురుగ్గా ఉండే కరీంనగర్‌ జిల్లాకు చెందిన పేద విద్యారి్థని మరణం అప్పట్లో సంచలనం సృష్టించింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఇదే హాస్టల్‌లో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడకు చెందిన దాసరి హర్ష అనే మెడిసిన్‌ ఫైనలియర్‌ విద్యార్థి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెల దాటిందో లేదో సనత్‌ ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తల్లిదండ్రుల అనుమానాల నేపథ్యంలో సనత్‌ ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు వన్‌ టౌన్‌ పోలీసులు తెలిపారు. 

నువ్వే డాక్టర్‌ అనుకుంటిమి 
‘మన కుటుంబం మొత్తంలో ఇప్పటివరకు డాక్టర్‌ లేడు.. నువ్వే డాక్టర్‌ అనుకుంటిమి కదా సన్నీ (సనత్‌ ముద్దు పేరు).. డాక్టర్‌ అయి వస్తావనుకుంటే ఇలా నిన్ను తీసుకుపోతామని అనుకోలేదు కొడుకా.. నా సన్నీను ఇలా చూడలేను.. అన్నను అమెరికా వెళ్లనీ అన్నావు.. నువ్వెటు పోతివిరా సన్నీ..’అంటూ సనత్‌ తల్లి సుజాత విలపించిన తీరు కంటతడి పెట్టించింది.  

అప్పుడే అనుకున్నా కానీ.. 
సనత్‌ సెల్‌ఫోన్‌లో ఉన్న ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో అతని ఒక్కడి నంబర్‌ మాత్రమే ఉంది. ఆ గ్రూప్‌లో ‘సారీ.. మమ్మీ, డాడీ, అన్నయ్యా.. ఇలా చేద్దామని ఫార్మా పేపర్‌–1 పరీక్ష అయ్యాకే అనుకున్నా.. కానీ మేడం, ఫ్రెండ్స్‌ డిస్టర్బ్‌ అవుతారని చేసుకోలేదు.. అన్నయ్యా నువ్వు యూఎస్‌ నుంచి వచ్చి ఇక్కడ ఉండు..’అంటూ రాత్రి 3:11 గంటలకు పోస్ట్‌ చేసిన ఓ మెసేజ్‌ ఉంది. సనత్‌ అన్నయ్య సాయితేజ నెల క్రితమే ఎమ్మెస్‌ చదువు నిమిత్తం యూఎస్‌ వెళ్లాడు. 

తిరుపతి వెళ్దామని చెప్పి ఇలా చేశాడు..
ఏప్రిల్‌ 4 తరువాత తిరుపతి వెళదామని చెప్పిన తమ కుమారుడు ఇంతలోనే ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ సనత్‌ తండ్రి రమేశ్‌ విలపించాడు. మూడురోజుల క్రితం ఫోన్‌ చేసినప్పుడు కూడా ఏదైనా సమస్య ఉన్నట్టుగా చెప్పలేదన్నాడు. సనత్‌కు ఏడాది క్రితం గాల్‌ బ్లాడర్‌ సర్జరీ అయిందని, ఇప్పుడు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యా లేదని చెప్పాడు. సనత్‌ మరణించినట్టుగా ప్రిన్సిపాల్‌ తమకు సమాచారం ఇచ్చారని, తాము వచ్చేవరకు మృతదేహాన్ని తీయవద్దని ప్రిన్సిపాల్‌కు చెప్పినా తీశారని తెలిపాడు. తమ కుమారుడి ఫోన్‌ లాక్‌ ఎవరు ఓపెన్‌ చేశారో తెలియదని చెప్పాడు.  

మరిన్ని వార్తలు