ప్రీతి కేసు: ఇదంతా ఠాగూర్‌ సినిమాలెక్కుంది!.. నిమ్స్‌ వద్ద హైటెన్షన్‌

26 Feb, 2023 19:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పీజీ డాక్టర్‌ ప్రీతికి అందుతున్న చికిత్స విషయంలో నిమ్స్‌ వైద్యులు వ్యవహరిస్తున్న తీరుపై ఆమె కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఇది ఠాగూర్‌ సినిమా లెక్కుందని ఆమె బాబాయ్‌ రాజ్‌కుమార్‌ ఆగ్రహం వెల్లగక్కారు. ఇక..  నిన్నటిదాకా ఆమె బతికే అవకాశాలు ఉన్నాయని చెప్పారని, ఇవాళేమో హఠాత్తుగా బ్రెయిన్‌డెడ్‌ అయ్యిందని చెప్తున్నారని ఆమె తండ్రి నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో కాసేపట్లో ప్రీతి ఆరోగ్య స్థితిపై కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో నిమ్స్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 

డాక్టర్లు మాకేమో ఒకటి చెప్తున్నారు. ఆస్పత్రి చుట్టూ పోలీసులను పెడుతున్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి మా అమ్మాయిని బతికించాలనే ఉద్దేశం ఉంటే ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించేది. కానీ, అలా చేయలేదు. ఇప్పుడు జరుగుతున్నదంతా ఠాగూర్‌ సినిమా లెక్కే ఉంది అని ప్రీతి బాబాయ్‌ రాజ్‌కుమార్‌ ఆగ్రహం వెల్లగక్కారు. 

మరోవైపు ప్రీతికి నిమ్స్‌లో సరైన చికిత్స అందడం లేదని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, ప్రీతి కుటుంబ సభ్యులకు పరామర్శ సందర్భంగా మీడియా ముందు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మెరుగైన చికిత్స పేరిట వరంగల్‌ ఎంజీఎం నుంచి ప్రీతిని హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు. గత ఐదు రోజులుగా చికిత్స అందిస్తూ.. ఎప్పటికప్పుడు పరిస్థితి విషమంగానే ఉందటూ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తూ వచ్చారు. అయితే తమకు మాత్రం ప్రీతి బ్రతుకుతుందనే భరోసా ఇస్తూ.. ఇప్పుడు హఠాత్తుగా బ్రెయిన్‌ డెడ్‌, బతికే అవకాశం లేదని వైద్యులు చెప్పడంపై ఆమె కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
 
గాంధీకి ప్రీతి!
ఇదిలా ఉంటే నిమ్స్‌ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. మరోవైపు.. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఈ తరుణంలో..  ఏ క్షణమైనా ప్రీతిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తారనే ప్రచారం నడుస్తోంది. ఏది అనేది కాసేపట్లో నిమ్స్‌ వైద్యులు విడుదల చేసే బులిటెన్‌.. కీలక ప్రకటనపైనే ఆధారపడి ఉంది.

మరిన్ని వార్తలు