మీర్‌పేట చెరువుకు గండి..ఆందోళనలో స్థానికులు

20 Oct, 2020 14:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భారీ వర్షాల కారణంగా నగర శివారులోని మీర్‌పేట్‌–బడంగ్‌పేట్‌ల మధ్య ఉన్న పెద్ద చెరువు కట్టకు గండిపడింది. రోడ్లుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల హెచ్చరికలతో న్యూ బాలాజీనగర్‌ కాలనీలో 90 శాతం మంది, జనప్రియనగర్‌లోని క్వార్టర్లలో 20 శాతం మంది ఇప్పటికే తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. మిగిలిన కాలనీల్లోనూ చాలా వరకు ఇళ్లు ఖాళీ అయ్యాయి. 
(చదవండి : వణికిస్తున్న మీర్‌పేట్‌ చెరువు)

మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట–బడంగ్‌పేట మధ్యలో ఉన్న చెరువు పేరులోనే కాదు విస్త్రీర్ణంలోనూ చాలా పెద్దది.  హరితహారంలో భాగంగా చెరువు కట్టకు భారీగా డ్రిల్లింగ్‌ చేశారు. మొక్కల కోసం తవ్విన ఈ గుంతల నుంచి వాటర్‌ లీకేజీ అవుతోంది.శిఖం భూములు చాలా వరకు కబ్జాకావడం, ఇంటి వ్యర్ధాలను కట్టకు లోపలి వైపు పోయడంతో చెరువు విస్త్రీర్ణం చాలా వరకు కుంచించుకుపోయింది.  చిన్న పాటి వర్షానికి చెరువు పొంగిపొర్లుతోంది. ఫలితంగా కింద ఉన్న న్యూబాలాజీనగర్, జనప్రియనగర్, ఎంఎల్‌ఆర్‌కాలనీ, ఎస్‌ఎల్‌ఎన్‌ ఎస్‌కాలనీ, టీఎస్‌ఆర్‌కాలనీ, అయోధ్యనగర్‌లకు వరద పోటెత్తి నీటమునుగుతున్నాయి. 

మరిన్ని వార్తలు