వణికిస్తున్న మీర్‌పేట్‌ చెరువు

20 Oct, 2020 06:56 IST|Sakshi
లీకేజీ వద్ద ఇసుక బస్తాలను వేస్తున్న దృశ్యం

సాక్షి, మీర్‌పేట్‌: నగర శివారులోని మీర్‌పేట్‌–బడంగ్‌పేట్‌ల మధ్య ఉన్న పెద్ద చెరువు నివురుగప్పిన నీరులా ఉంది. చెరువు ప్రమాదకర స్థితిలో ఉందని, ఏ క్షణంలోనైనా కట్టకు గండిపడే మీర్‌పేట పరిధిలోని పెద్దచెరువుకు గండిపడితే.. ఆ నీరంతా ఆయా కాలనీల మీదుగా కింద ఉన్న మంత్రాల చెరువులోకి చేరుతోంది.  

  • ఇప్పటికే మంత్రాల చెరువు పొంగిపొర్లుతుండటంతో దానికింద ఉన్న మిథులానగర్, సత్యసాయి నగర్‌లు పూర్తిగా నీటమునిగాయి. 
  • మంత్రాల చెరువు నుంచి నీరంతా సందె చెరువులోకి చేరి అటు నుంచి కాలనీలను ముంచేస్తూ..జిల్లెలగూడ, మందమల్లమ్మ, వివేక్‌నగర్, కర్మన్‌ఘాట్, గ్రీన్‌పార్క్‌కాలనీల మీదుగా సరూర్‌నగర్‌ చెరువులోకి చేరుతోంది.
  • సరూర్‌నగర్‌ చెరువులోకి ఒక్కసారిగా వరద నీటి ఉధృతి పెరిగితే..దాని కింద ఉన్న చాలా కాలనీలు నీటమునుగుతాయి.
  • అందువల్లే ఇక్కడి ప్రజల బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పటికే వారం రోజుల నుంచి వరదలో మగ్గిపోయి... ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా..పెద్దచెరువ రూపంలో మరో ప్రమాదం పొంచి ఉందనే వార్త వారిని వణికిస్తోంది. అధికారులు ఏం చర్యలు తీసుకుంటారోనని ఎదురుచూస్తున్నారు.

  • ప్రమాదం లేకపోలేదని బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో  ఆ చెరువు కింద ఉన్న కాలనీవాసుల్లో మరింత ఆందోళన మొదలైంది. ముందస్తు చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తుండటంతో ఇళ్లు, వాకిళ్లను వదిలేసి బతుకుజీవుడా అంటూ బాధితులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. రియల్‌ వ్యాపారుల మాటలు నమ్మి రూ.లక్షలు వెచ్చించి ఇళ్లను కొనుగోలు చేసి ప్రస్తుతం తాము భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

90 శాతం ఇళ్లు ఖాళీ... 

  • మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట–బడంగ్‌పేట మధ్యలో ఉన్న చెరువు పేరులోనే కాదు విస్త్రీర్ణంలోనూ చాలా పెద్దది.  
  • హరితహారంలో భాగంగా చెరువు కట్టకు భారీగా డ్రిల్లింగ్‌ చేశారు. మొక్కల కోసం తవ్విన ఈ గుంతల నుంచి వాటర్‌ లీకేజీ అవుతోంది.  
  • శిఖం భూములు చాలా వరకు కబ్జాకావడం, ఇంటి వ్యర్ధాలను కట్టకు లోపలి వైపు పోయడంతో చెరువు విస్త్రీర్ణం చాలా వరకు కుంచించుకుపోయింది.  
  • చిన్న పాటి వర్షానికి చెరువు పొంగిపొర్లుతోంది. ఫలితంగా కింద ఉన్న న్యూబాలాజీనగర్, జనప్రియనగర్, ఎంఎల్‌ఆర్‌కాలనీ, ఎస్‌ఎల్‌ఎన్‌ ఎస్‌కాలనీ, టీఎస్‌ఆర్‌కాలనీ, అయోధ్యనగర్‌లకు వరద పోటెత్తి నీటమునుగుతున్నాయి.  
  • అధికారుల హెచ్చరికలతో న్యూ బాలాజీనగర్‌ కాలనీలో 90 శాతం మంది, జనప్రియనగర్‌లోని క్వార్టర్లలో 20 శాతం మంది ఇప్పటికే తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. మిగిలిన కాలనీల్లోనూ చాలా వరకు ఇళ్లు ఖాళీ అయ్యాయి. 
  • ఇసుక బస్తాలతో పాటు కట్టపై మట్టిని పోసి ప్రమాదం జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.  

‘మాది విజయవాడ. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నా. హైదరాబాద్‌లో సొంత ఇల్లు కొనుక్కోవాలనేది నా జీవితాశయం. ఆ మేరకు 18 నెలల క్రితం హౌసింగ్‌ లోన్‌ తీసుకుని మీర్‌పేట న్యూ బాలాజీనగర్‌లో రూ.54 లక్షల వెచ్చించి ఇల్లు కొన్నా. కుటుంబ సభ్యులతో కలిసి ఇదే ఇంట్లో ఉంటున్నాం. పదిహేను రోజుల నుంచి వరద ఓ మోస్తరుగా ఉంది. మూడు రోజుల క్రితం భారీగా పోటెత్తింది. కాలనీలోని ఇళ్లను ముంచెత్తింది. ఇంట్లోకి భారీగా వరద చేరడంతో టీవీ, కంప్యూటర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్‌మిషన్‌ సహా ఉప్పు, పప్పు, బియ్యం ఇలా నిత్యావసర వస్తువులన్నీ వరదనీటిలో మునిగిపోయాయి. ఉన్న ఫలంగా ఇల్లు వదిలేసి కట్టు బట్టలతో బయటికి రావాల్సి వచ్చింది. అటు బిల్డర్‌ చెప్పిన మాటలతోనే కాదు.. ఇటు వరదతోనూనిండా మునిగిపోయాం.’ ... ఇదీ న్యూ బాలాజీనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రవికుమార్‌ ఆవేదన. నగర శివారు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లను కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరిదీ ఇదే వ్యథ.

ప్రాణభయంతో వెళ్తున్నా 
చాలా రోజులుగా ఎంఎల్‌ఆర్‌కాలనీ ముంపులోనే ఉంది. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ ఇప్పటికే తడిసిపోయాయి. రూ.2 లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. మురుగునీటి మధ్య ఇంట్లో ఉండలేక బయటకు రాలేక నరకం అనుభవిస్తున్నాం. ప్రస్తుతం పెద్దచెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో చేసేదేమీలేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇంటిని వదిలి వెళ్తున్నా. ఇప్పటికే చాలా మంది ఇళ్లను వదిలి వెళ్లిపోయారు.  – రాజు, ఎంఎల్‌ఆర్‌కాలనీ 

పెద్ద చెరువు లీకేజీలను అరికట్టేందుకు
ముందస్తుగా చర్యలు చేపట్టాం.  కట్టపై నాలుగు చోట్ల ఇసుక బస్తాలను వేస్తున్నాం. ఇప్పటికే కింది కాలనీలను ఖాళీ చేయించాం. – బి.సుమన్‌రావు, కమిషనర్‌ 

మరిన్ని వార్తలు