బాధ్యులపై చర్యలు తప్పవు

4 Sep, 2022 02:13 IST|Sakshi
సీతారాంపేట్‌లో వివరాలు సేకరిస్తున్న కేంద్ర బృందం 

జాతీయ మహిళా కమిషన్‌ కార్యదర్శి మీటా రాజీవ్‌ లోచన్‌ 

ఇబ్రహీంపట్నం ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర బృందం 

కు.ని. మరణాల వ్యవహారంపై ఆరా

ఇబ్రహీంపట్నం రూరల్‌/ ఇబ్రహీంపట్నం: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కారణంగా నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనలో బాధ్యులను వదిలిపెట్టేది లేదని జాతీయ మహిళా కమిషన్‌ కార్యదర్శి మీటా రాజీవ్‌ లోచన్‌ హెచ్చరించారు. జాతీయ మహిళా కమిషన్‌ బృందం శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించింది. బృందం సభ్యులు వైద్యులతో సమీక్ష నిర్వహించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సీతారాంపేట్‌ గ్రామానికి వెళ్లి కు.ని. ఆపరేషన్‌ వికటించి మృతి చెందిన లావణ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆపరేషన్‌ జరిగిన సమయం నుంచి.. లావణ్య మరణించే వరకు ఏం జరిగిందని ఆరా తీశారు. ఈ సందర్భంగా మీటా రాజీవ్‌ లోచన్‌ మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం ఘటనపై ప్రాథమిక స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవన్నారు. బాధితులకు అందాల్సిన పరిహారంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి నివేదిక అందజేస్తామన్నారు. చివరగా కేంద్ర బృందం రంగారెడ్డి కలెక్టరేట్‌కు చేరుకుంది. అక్కడ అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో బృందం సభ్యులు సమావేశమయ్యారు. పూర్తిస్థాయిలో విచారణకు వైద్యాధికారులను ఆదేశించాలని.. వివరాలను మహిళా కమిషన్‌కు అందజేయాలని సూచించారు. 

మరిన్ని వార్తలు