బీజేపీ కార్యవర్గ భేటీపై నేడు ఢిల్లీలో సమీక్ష!

22 Jun, 2022 02:06 IST|Sakshi

సన్నాహాలను జాతీయ నేతలకు వివరించనున్న రాష్ట్ర నేతలు

హైదరాబాద్‌లో భేటీ కోసం వేగంగా ఏర్పాట్లు

పూర్తిగా శాఖాహార భోజనం.. గ్రూపులుగా పని విభజన 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ, ప్రధాని మోదీ బహిరంగ సభలకు ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ఈ కార్యక్రమా లకు సన్నాహాలపై బుధవారం ఢిల్లీలో రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ ముఖ్య నేతలతో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌జీ సమావేశం కానున్నట్టు తెలిసింది. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నేతలు ఎన్‌.రామచంద్ర రావు, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, చింతల రామచంద్రా రెడ్డి ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

ఫైనాన్స్, పబ్లిక్‌ మీటింగ్, ఆహ్వానం–వీడ్కోలు, రవాణా, భోజనం, అలంకరణ తదితర అంశాలపై ఇప్పటివరకు చేసిన కసరత్తు, ఏర్పాట్లను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించనున్నారు. జాతీయ నాయకత్వం ఈ ఏర్పాట్లను పరిశీలించి ఏవైనా మార్పుచేర్పులు అవసరమైతే సూచించ నుంది. కాగా మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాల యంలో ఆర్థిక వ్యవహారాల కమిటీ, బహిరంగసభ ఏర్పాట్లు, ఇతర కమిటీలతో బీజేపీ జాతీయ నేతలు సమావేశమై సమీక్షించారు.

పూర్తిగా శాఖాహార భోజనమే..
బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ సందర్భంగా పూర్తిగా శాఖాహార భోజనం, అల్పాహారం వడ్డించా లని నిర్ణయించారు. ఒకరోజు పూర్తిగా తెలంగాణ వంటకాలు, రుచులను ఇతర రాష్ట్రాల ప్రతినిధు లకురుచి చూపించనున్నారు. ఇక భేటీ, సభ నిర్వ హణకు సంబంధించి పలువురు నేతలను గ్రూపు లుగా విభజించి బాధ్యతలను అప్పగించారు. 

మరిన్ని వార్తలు