లోక కల్యాణం కోరుకునేది హిందూధర్మమే

25 Sep, 2021 01:44 IST|Sakshi
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో పాల్గొన్న సాధుసంతులు

ధర్మాచార్యుల సమావేశంలో సాధుసంతులు 

డిసెంబర్‌ 14న ‘లక్ష యువగళ గీతార్చన’ 

సాక్షి, హైదరాబాద్‌: యువతలో ఆత్మవిశ్వాసం నింపే భగవద్గీత వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరముందని, లోకకల్యాణం కోరుకునే ఏకైక ధర్మం హిందూ ధర్మం అని సాధుసంతులు అన్నారు. శుక్రవారం విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో ధర్మాచార్యుల సమావేశం హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌లో జరిగింది. సమావేశానికి 82 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరై ప్రసంగించారు. వచ్చే డిసెంబర్‌ 14న గీత జయంతి రోజు లక్ష మంది యువకులతో ‘లక్ష యువగళ గీతార్చన‘కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా సాధు సంతులతో ధర్మాచార్యుల సమ్మేళనం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామీజీలు మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా విశ్వహిందూ పరిషత్‌ లక్ష యువగళ గీతార్చన వేడుక నిర్వహించనున్నట్లు తెలిపారు. యువతీ యువకులకు సంస్కార అమృతం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రపంచ దేశాలకు గురు స్థానంలో ఉన్న భారత్‌.. భగవద్గీత ఆధారంగా జ్ఞానాన్ని అందించిందని పేర్కొన్నారు.

విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర సంఘటన కార్యదర్శి యాదిరెడ్డి మాట్లాడుతూ దేశంలో హిందుత్వం తగ్గితే మారణహోమం పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతీ హిందువు తమ కర్తవ్యంగా ధర్మ రక్షణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్‌ జాతీయ నాయకుడు రాఘవులు, రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, లక్ష యువ గళ గీతార్చన కార్యక్రమ కన్వీనర్‌ వెంకటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు