ఓడినా పైచేయి నిజాందేనంటూ.. మజ్లిస్‌ పత్రిక ప్రచారం

17 Sep, 2022 17:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ సంస్థకు ‘మీజాన్‌’ పేరుతో ఓ పత్రిక ఉంది. నరరూప రాక్షసుడిగా ముద్రపడ్డ ఖాసింరజ్వీ నేతృత్వంలో ఉన్న సంస్థ కావటంతో దాని పత్రిక కూడా నిజాం సేనలకు అనుకూల వార్తలతో జనాన్ని తప్పుదోవ పట్టించే యత్నం చేసింది. ఓవైపు భారత సేనలు హైదరాబాద్‌ను చుట్టుముట్టడంతో నిజాం సైన్యం తోకముడిచినా.. ఎంఐఎం పత్రిక మీజాన్‌ మాత్రం, నిజాం సైన్యానిదే పైచేయి అంటూ తప్పుడు కథనాలను జనంలోకి వదిలింది.

మరోవైపు నిజాం నియంత్రణలో ఉన్న హైదరాబాద్‌ రేడియో కూడా నిజాం సేనలు వీరోచితంగా పోరాడుతూ భారత సైన్యాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నాయని వార్తలు వెలువరించింది. సెప్టెంబర్‌ 17 సాయంత్రం వరకు జరిగిన ఈ తంతు ఆ తర్వాత ఆగిపోయింది. తప్పుడు వార్తలే కాదు, తుదకు ఆ పత్రిక, రేడియో కూడా ఆ తర్వాత మూగబోయాయి. 

సైన్యానికి స్వాగతం పలికిన జనంపై రజాకార్ల దాడులు
భారత సైన్యం రాకను అడ్డుకోలేకపోయిన నిజాం సేనలు, ఆ అక్కసును సాధారణ ప్రజలపై చూపించాయి. నగరానికి చేరుకున్న భారత సైనిక పటాలాలను చూసి సంబరపడ్డ జనం, హారతులిచ్చి స్వాగతం పలికాయి. బొల్లారం మిలటరీ కేంద్రం వద్ద పండగ వాతావరణం నెలకొంది. సెప్టెంబరు 17న రాత్రి అక్కడికి దొంగచాటుగా చేరుకున్న రజాకార్ల బృందం సాధారణ ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. దీంతో అమాయకులు బలయ్యారు. విషయం తెలుసుకున్న భారత సైనికులు గాలించి మరీ ముష్కరులను పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు.  

చదవండి: (బురఖా ధరించి మహిళ వేషంలో గోడ దూకి పరారైన... నిజాం నవాబు ప్రధాని)

మరిన్ని వార్తలు