అప్పు తిరిగివ్వాలని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి...

15 Feb, 2021 22:00 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : అప్పు తీసుకున్న మహిళ డబ్బులు వెనక్కివాలని డిమాండ్‌ చేస్తూ వాటర్‌ ట్యాంక్‌ ఎక్కారు ఏడుగురు వ్యక్తులు. ఈ సంఘటన కరీంనగర్‌లో సోమవారం చోటుచేసుంది. వివరాల్లోకి వెళితే.. అంబేద్కర్ నగర్లో నివాసం ఉండే ఓ మహిళ స్థానికంగా ఉండే పలువురి వద్ద అప్పు క్రింద డబ్బులు తీసుకుని ఇవ్వక పోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో అప్పు తీసుకున్న మహిళ త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించి బాధితులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో, తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ బాధితులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించారు. అప్పుగా తీసుకున్న డబ్బులు వెంటనే ఇప్పించాలని లేకుంటే ట్యాంక్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

స్థానిక కార్పోరేటర్తో పాటు పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు. డబ్బులు ఇప్పించే వరకు దిగమని బాధితులు ససేమిరా అన్నారు. చివరకు ఎస్ఐ ట్యాంక్ పైకి ఎక్కి డబ్బులు ఇప్పించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు కిందికి దిగారు. దాదాపు రెండు గంటలపాటు రాత్రిపూట బాధితులు ట్యాంక్ పై హంగామా చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది.

మరిన్ని వార్తలు