Nagoba Jatara: కొత్త కోడళ్ల భేటింగ్‌

23 Jan, 2023 01:07 IST|Sakshi
కోనేరు నుంచి పవిత్ర జలం సేకరిస్తున్న మెస్రం వంశ కొత్త కోడళ్లు  

నాగోబా ఆలయంలో మెస్రం వంశీయుల పూజలు 

కేస్లాపూర్‌ జాతరకు తరలివచ్చిన భక్తులు

ఇంద్రవెల్లి (ఖానాపూర్‌): ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయంలో మెస్రం వంశీయుల పూజలు కొనసాగుతున్నాయి. కొత్త కోడళ్ల భేటింగ్‌ ఆదివారం వేకువజాము వరకు కొనసాగింది. ముందుగా ఆలయ సమీపంలోని గోవడ్‌ వద్ద బస చేసిన మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేసి సంప్రదాయ వాయిద్యాలతో ఆలయానికి చేరుకున్నారు.

190 మంది కొత్త కోడళ్లు సతీదేవత ఆలయంలో పూజల అనంతరం భేటింగ్‌ (పరిచయం)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఉదయం కోనేరు నుంచి పవిత్ర జలాన్ని గోవడ్‌ వద్దకు తీసుకువచ్చారు. ఆ నీటితో నైవేద్యం తయారు చేసి నాగోబా, సతీదేవతలకు సమర్పించారు. ఈ ప్రక్రియ అనంతరం వారంతా మెస్రం వంశంలో చేరినట్లుగా భావిస్తారు. అనంతరం కొత్తకోడళ్లు దీక్ష విరమించారు. ఆదివారం జాతరకు భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈనెల 28 వరకు జాతర కొనసాగుతుందని ఈవో రాజమౌళి, ఆలయ కమిటీ చైర్మన్‌ మెస్రం తుకారాం తెలిపారు. 

మరిన్ని వార్తలు