తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్‌ అలర్ట్‌!

27 Apr, 2023 03:19 IST|Sakshi

నేడు కూడా వానలు..పలుచోట్ల భారీ వర్షాలకు చాన్స్‌ 

హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో కుండపోత కురవొచ్చన్న వాతావరణ శాఖ 

బుధవారం సగటున 2.32 సెం.మీ. వర్షపాతం నమోదు 

రాష్ట్రమంతటా నాలుగైదురోజులుగా వర్షాకాలాన్ని తలపించిన తీరు 

కొన్నిరోజులు 40 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వాతావరణం వానాకాలాన్ని తలపిస్తోంది. పొద్దంతా ఎండ తీవ్రంగా ఉన్నా.. సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడి వానలు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలూ బాగా తగ్గి చలి వేస్తోంది. నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని పలుచోట్ల ఈ పరిస్థితి కనిపించగా.. మరో మూడు రోజులూ ఇలాంటి వాతావరణమే కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

హైదరాబాద్‌ చుట్టూ భారీగా.. 
పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీనికితోడు రాష్ట్రానికి దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండ్రోజులు హైదరాబాద్, పరిసర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

పలుచోట్ల సగటున 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వరకు కుండపోత వానలు పడొచ్చని ప్రకటించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు, పలుచోట్ల వడగళ్లు కురుస్తాయని పేర్కొంది. 

రాష్ట్రవ్యాప్తంగా వానలే.. 
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఒక్కరోజే రాష్ట్రంలో సగటున 2.32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా వానాకాలంలోనే ఇలా వర్షపాతం నమోదవుతుంది. అలాంటిది ఈసారి నడి వేసవిలో కురుస్తున్నాయి. బుధవారం రాష్ట్రంలో 0.02 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఏకంగా 2.32 సెంటీమీటర్లు కురవడం గమనార్హం. 

ప్రాంతాల్లో సిద్దిపేట.. జిల్లా సగటులో నారాయణపేట 
అత్యధికంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో 10 సెంటీమీటర్లు, వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేటలో 9, భువనగిరిలో 9 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఇక జిల్లా సగటు వర్షపాతాన్ని పరిశీలిస్తే.. నారాయణపేటలో 4.5 సెంటీమీటర్లు, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 4.48, యాదాద్రి భువనగిరిలో 3.88, వికారాబాద్‌ 3.66, మహబూబ్‌నగర్‌ 3.54, జోగుళాంబ గద్వాలలో 3.49 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. 

తగ్గిన ఉష్ణోగ్రతలు 
వరుస వానల నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం గరిష్టంగా నల్లగొండలో 38.5 డిగ్రీలుగా నమోదవడం గమనార్హం. ఇక హనుమకొండలో కనిష్ట ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలకు పడిపోయింది. వచ్చే మూడు రోజులు కూడా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకన్నా తక్కువగానే నమోదవుతాయని, పలుచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయి చలి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. 

>
మరిన్ని వార్తలు