Telangana: తేలికపాటి వానలు 

27 May, 2022 01:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రాగల 48గంటల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి... సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.

నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్‌ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం లోని మరికొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు వ్యాపించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో గురువారం నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 41.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత దుండిగల్‌లో 25 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, కొన్నిచోట్ల సాధారణం కంటే ఒకట్రెండు డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.  

మరిన్ని వార్తలు