బొగ్గుతో మెథనాల్‌ ఉత్పత్తి

10 Sep, 2021 03:45 IST|Sakshi

టెక్నాలజీని డిజైన్‌ చేసిన బీహెచ్‌ఈఎల్‌ 

ప్రయోగాత్మక రియాక్టర్‌తో విజయవంతంగా పరీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకునే దిశలో భారత్‌ మరో ముందడుగు వేసింది. బూడిద శాతం ఎక్కువగా ఉండే భారతీయ బొగ్గు నుంచి మోటారు ఇంధనంగా ఉపయోగపడే మెథనాల్‌ను ఉత్పత్తి చేసేందుకు అవసరమైన టెక్నాలజీని డిజైన్‌ చేసింది. ప్రయోగాత్మక రియాక్టర్‌ను విజయవంతంగా పరీక్షించింది.  

మెథనాల్‌తో కాలుష్యం తక్కువ 
పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే మెథనాల్‌తో కాలుష్యం తక్కువ. ఇప్పటికే నౌకల ఇంజిన్లలో దీన్ని విస్తృతంగా వాడుతున్నారు. అంతేకాకుండా.. మెథనాల్‌తో డీజిల్‌ మాదిరిగానే ఉండే డై మిథైల్‌ ఈథర్‌ను కూడా తయారు చేయవచ్చు. కొద్దిపాటి మార్పులతో ఈ ఇంధనాన్ని కార్లు, లారీలు, బస్సుల్లో వాడుకోవచ్చు. ప్రపంచ దేశాల్లో  మెథనాల్‌ను సహజ వాయువుతో తయారు చేస్తుండగా భారత్‌లో దాని నిక్షేపాలు తక్కువగా ఉన్న కారణంగా సాధ్యపడటం లేదు. భారత్‌లో విస్తారంగా అందుబాటులో ఉన్న బొగ్గుతో తయారు చేయగలిగినా భారతీయ బొగ్గులో బూడిద మోతాదు చాలా ఎక్కువ.  

98 నుంచి 99.5 శాతం స్వచ్ఛత: సారస్వత్‌ 
అందుబాటులో ఉన్న అదేతరహా బొగ్గును వినియోగించుకుని మెథనాల్‌ తయారు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం అంటే 2016లోనే హైదరాబాద్‌లోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌)లో దీనికి సంబంధించిన పరిశోధనలు మొదలయ్యాయి. నీతి అయోగ్‌ సహకారంతో మొదలైన ఈ పరిశోధనల్లో భాగంగా టెక్నాలజీకి రూపకల్పన చేసి, ముందుగా రోజుకు 0.25 టన్నుల మెథనాల్‌ను తయారు చేసే ఓ రియాక్టర్‌ను తయారు చేయాలని నిర్ణయించారు.

నాలుగేళ్ల శ్రమ తరువాత, కేంద్ర ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన విభాగం ఇచ్చిన రూ.10 కోట్ల గ్రాంట్‌తో తొలి రియాక్టర్‌ సిద్ధమైంది. దీనిని గత సోమవారం విజయవంతంగా పరీక్షించారు. దీనిద్వారా ఉత్పత్తి అయిన మెథనాల్‌ 98 నుంచి 99.5 శాతం స్వచ్ఛతతో ఉన్నట్లు తెలిసిందని, నీతి అయోగ్‌ గౌరవ సభ్యులు, డీఆర్‌డీవో మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ వీకే సారస్వత్‌ తెలిపారు. బొగ్గును గ్యాస్‌గా మార్చి వాడుకునేందుకు, బొగ్గు నుంచి స్వచ్ఛ ఇంధనం హైడ్రోజన్‌ను తయారు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది తొలి విజయమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు