Lockdown: బస్సులు, మెట్రో రైళ్లు తిరిగే సమయాలివే..

12 May, 2021 02:07 IST|Sakshi

10 గంటల వరకే ఆర్టీసీ బస్సులు 

మెట్రో సేవలు.. ఉదయం 7–9:45 వరకే.. 

లాక్‌డౌన్‌తో స్తంభించనున్న ప్రజా రవాణా 

సాక్షి, హైదరాబాద్‌/హయత్‌నగర్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో నేటి నుంచి ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకే బస్సులు నడుస్తాయని ఆర్టీసీ పేర్కొంది. సిటీ బస్సులు, జిల్లా సర్వీసులు కూడా ఈ సమయంలోనే నడుస్తాయని, ఆయా డిపోల పరిధిలో బస్సుల సమయాల్లో మార్పులు చేస్తారని పేర్కొంది. ఇతర రాష్టాలకు బస్సులు నడపమని వెల్లడించింది. ఈ సడలింపు 4 గంటల వ్యవధిలో గమ్యస్థానాలకు వెళ్లగలిగిన ప్రాంతాలకే బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.

మెట్రో సేవలు ఇలా... 
మెట్రో రైళ్లు ఉదయం 7 నుంచి 9:45 గంటల వరకు రాకపోకలు సాగించనున్నాయి. తొలి రైలు ఉదయం 7 గంటలకు ఎల్‌బీనగర్‌ నుంచి మొదలుకానుంది. చివరి రైలు 8:45 ఎల్‌బీ నగర్‌ నుంచి బయలుదేరి 9:45కు మియాపూర్‌ చేరుకుంటుందని ఎల్‌అండ్‌టీ మెట్రో మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీబీ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, సురక్షిత మెట్రో ప్రయాణానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు.  

టికెట్‌ చూపించి విమానాశ్రయానికి... 
లాక్‌డౌన్‌ నేపథ్యంలో మళ్లీ ప్రజారవాణా స్తంభించనుంది. 4 గంటలు మాత్రమే ప్రజారవాణాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. ప్రైవేట్‌ బస్సులు, క్యాబ్‌లు, ఇతర రవాణా వాహనాలకు బ్రేక్‌ పడనుంది. హైదరాబాద్‌లో సుమారు 1.40 లక్షల ఆటో రిక్షాలు, 50 వేల క్యాబ్‌లు లాక్‌డౌన్‌ తో స్తంభించనున్నాయి. ఆటో రిక్షాలు, క్యాబ్‌లు కూడా లాక్‌డౌన్‌ మార్గదర్శకాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే రాకపోకలు సాగించనున్నాయి. ఈ రంగంపై ఆధారపడ్డ 2 లక్షల మంది కార్మికులు లాక్‌డౌన్‌ తో ఉపాధి కోల్పోయే అవకాశముంది. నగరంలో 2,750 ఆర్టీసీ బస్సులు ఉండగా, లాక్‌డౌన్‌ వల్ల 1,000 బస్సులకు మించి తిరిగే అవకాశం లేదు. దీంతో గ్రేటర్‌లో ఆర్టీసీకి రూ.2 కోట్ల నష్టం వాటిల్లనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా... విమానాలు, రైళ్లలో ప్రయాణించే వారు టికెట్‌ను చూపడం ద్వారా విమానాశ్రయం, రైల్వేస్టేషన్లకు చేరుకోవచ్చని అధికారవర్గాలు తెలిపాయి.  

సడలింపు సమయాల్లో బస్సులు.. 
లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో ప్రధాన రూట్లలో బస్సులను నడిపిస్తాం. ప్రయాణికులు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలి. ప్రయాణికులకు వైరస్‌ సోకకుండా బస్సులను శానిటైజ్‌ చేస్తున్నాం. సిబ్బందికి ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి విధులకు పంపుతున్నాం. ప్రయాణికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.   చదవండి: (నేటి నుంచి 10 రోజుల లాక్‌డౌన్‌.. మినహాయింపు వాటికే!) 

మరిన్ని వార్తలు