భారతీయ రైల్వేలో మూడవ యూనిట్‌గా మెట్టుగూడ

31 Oct, 2021 15:41 IST|Sakshi

పాయింట్‌ మిషన్‌ రూపొందించిన మెట్టుగూడ సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ వర్క్‌షాపు

‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ దిశగా మరో ముందడుగు

సాక్షి, హైదరాబాద్‌: రైళ్లు నడిచే సమయంలో ఒక ట్రాక్‌ నుంచి మరో ట్రాక్‌కు మారేందుకు వినియోగించే పాయింట్‌ మెషీన్‌లను దక్షిణమధ్య రైల్వే తయారు చేసింది. మెట్టుగూడలోని సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూకేషన్స్‌ వర్క్‌షాపు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించింది. రైల్వేనెట్‌ వర్క్‌లో కీలకమైన పాయింట్‌ మెషిన్‌లను రైళ్లు ఒక ట్రాక్‌ నుంచి మరో ట్రాక్‌కు సజావుగా మారేందుకు, ఈ క్రమంలో సంబంధిత పాయింట్‌లను సురక్షితంగా లాక్‌ చేసేందుకు వినియోగిస్తారు. రైళ్లు నడిచేటప్పుడు ప్రకంపనాలను నివారించేందుకు ఇవి దోహదం చేస్తాయి. 

‘ఆత్మనిర్భర్‌ భారత్‌’, ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కార్యక్రమాల లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే కృషిలో దక్షిణమధ్య రైల్వే ఈ కీలకమైన ముందడుగు వేసింది. మెట్టుగూడలోని సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యునికేషన్‌ వర్క్‌షాప్‌ స్వయం శక్తితో పాయింట్‌ మెషిన్లను తయారు చేసే సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. 143 ఎంఎం, 220 ఎంఎం పాయింట్‌ మెషిన్లను ఇక్కడ తయారు చేయడంతో పాటు సరఫరా చేసేందుకు అనుమతి లభించింది. పాయింట్‌ మెషీన్‌ల వినియోగంలో రైల్వేలు స్వయం సమృద్ధిని సాధించేందుకు అవకాశం లభించిందని దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా చెప్పారు.  

ఇది మూడో యూనిట్‌
ఇప్పటి వరకు పాయింట్‌ మెషిన్లను భారతీయ రైల్వేలో రెండు యూనిట్లలోనే తయారు చేస్తున్నారు. డిమాండ్‌ మేరకు ఉత్పత్తి లేకపోవడంతో ప్రైవేట్‌ సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు. తాజాగా మెట్టుగూడ వర్క్‌షాపు ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంతో భారతీయ రైల్వేలో మూడవ యూనిట్‌గా గుర్తింపు పొందింది. దీని వల్ల తక్కువ ధరకు భారీగా పాయింట్‌ మెషిన్లు లభించనున్నాయి. క్లాంప్‌ లాక్‌ ఏర్పాటుతో పాటు ట్రాక్‌ల వేగం పెంచేందుకు అవకాశం లభిస్తుంది. మెట్టుగూడ వర్క్‌షాపుకు సంవత్సరానికి 3,250 పాయింట్‌ మెషిన్‌లను తయారు చేసే సామర్థ్యం ఉంది. దక్షిణమధ్య రైల్వే అవసరాలను తీర్చడమే కాకుండా ఇతర జోన్లకు కూడా సరఫరా చేయవచ్చు. పాయింట్‌ మెషిన్ల జీవిత కాలం సాధారణంగా 12 సంవత్సరాలు లేదా 3 లక్షలసార్లు దీనిపై రైలు నడిపించవచ్చు. వీటి తయారీకి కృషి చేసిన మెట్టుగూడ వర్క్‌షాపు అధికారులు, సిబ్బందిని జనరల్‌ మేనేజర్‌ అభినందించారు. 

మరిన్ని వార్తలు