కేంద్రం కొత్త నిబంధనలు.. ‘ఉపాధి’ పనికి వెళ్తున్నారా? మీ జాబ్‌కార్డుతో ఆధార్‌ లింక్‌ అయి ఉందా?

9 Jan, 2023 17:03 IST|Sakshi

హుజూర్‌నగర్‌ (సూర్యాపేట): జాతీయ ఉపాధిహామీ పథకంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కూలీ హాజరు నమోదు కోసం నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎంఎంఎస్‌)ను అమలులోకి తెచ్చిన కేంద్రం తాజాగా కూలిల చెల్లింపుల్లోనూ కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఉపాధి కూలీల జాబ్‌కార్డును వారి ఆధార్‌తో అనుసంధానం చేస్తోంది.

దీంతో బోగస్‌ కూలీలకు చెక్‌ పడడమే కాకుండా కేంద్రం విడుదల చేసే నిధులు నేరుగా కూలీల ఖాతాలో జమకానున్నాయి. అయితే ఆధార్‌ సీడింగ్‌లో జిల్లా మెరుగైన స్థానంలో ఉన్నా జాబ్‌ కార్డు, ఆధార్‌ వివరాలు సరిపోలకపోవడం సమస్యాత్మకంగా మారుతోంది. ఆధార్‌ అథెంటికేషన్‌ ప్రక్రియ కొనసాగుతుండగా వేలాది దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో కూలీలు ఉపాధికి దూరమయ్యే అవకాశం ఉంది. 

చెల్లింపుల్లో పూర్తి పారదర్శకత 
ఉపాధి హామీ కూలీలకు ప్రస్తుతం బ్యాంక్, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా కూలి డబ్బులు చెల్లిస్తోంది. అయితే కొందరికి రెండేసి చొప్పున జాబ్‌కార్డులు ఉండడంతో పాటు, మరికొంత మంది పనులకు హాజరు కాకున్నా కూలి పొందుతున్నారు. రాజకీయ పలుకుబడి, నాయకుల అండదండలలతో పనులకు హాజరువుతున్నట్లుగా పేర్లు నమోదు చేసుకుని డబ్బులు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

దీనిని గుర్తించిన కేంద్రం కూలి చెల్లింపుల్లో పూర్తి పారదర్శకత తీసుకురావాలని సంకల్పించింది. కూలి చెల్లింపుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ఆధార్‌ బేస్‌డ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే కూలీల జాబ్‌ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేస్తోంది. దీంతో ఇకపై ఆధార్‌ లింకైన బ్యాంక్, పోస్టల్‌ బ్యాంక్‌ ఖాతాల్లో మాత్రమే కూలి డబ్బులు జమ కానున్నాయి. పబ్లిక్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (పీఎఫ్‌ఎంఎస్‌) ద్వారా డబ్బులు ఎటు వెళ్తున్నాయనేది కేంద్రం నేరుగా పర్యవేక్షించే వెసులుబాటు            కలగనుంది.

జిల్లాలో 6,31,156 మంది ఉపాధి కూలీలు.. 
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 2,71,992 జాబ్‌ కార్డులు ఉండగా వాటిలో 6,31,156 మంది కూలీలు నమోదై ఉన్నారు. వారిలో పనికి వచ్చే వారు 3,72,666 మంది ఉన్నారు. 
ముమ్మరంగా సాగుతున్న ప్రక్రియ జాబ్‌ కార్డుకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 96.83 శాతం జాబ్‌కార్డులకు ఆధార్‌ను లింక్‌ చేశారు.

అయితే రెండింటి (ఆధార్‌కార్డు, జాబ్‌కార్డు)లో కూలీల పేర్లు, చిరునామా వంటి వివరాలు సరిపోలకపోవడంతో భారీ సంఖ్యలో కార్డులు తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పటి వరకు 3,18,832 కార్డులు తిరస్కరణకు గురికావడంతో అప్రూవల్‌ కోసం పెండింగ్‌లో ఉంచారు. వాటిని మళ్లీ అథెంటికేషన్‌ కోసం పంపనున్నారు. దీంతో మరికొన్ని సవరణలతో కొన్ని కార్డులు అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం 29,770 మందికి ఆధార్‌ బేస్‌డ్‌ పేమెంట్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఆధార్‌ను బట్టి జాబ్‌కార్డును మారుస్తాం
జాబ్‌ కార్డులో ఉన్న వివరాలకు ఆధార్‌ కార్డులో ఉన్న వివరాలు సరిపోలకపోవడంతోనే కొన్ని కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని మళ్లీ అథెంటికేషన్‌కు పంపనున్నారు. కార్డులో ఉన్న వాటి వివరాలు 40 శాతం వరకు సరిపోలితే వాటిని పరిగణలోకి తీసుకుంటారు. లేదంటే ఆధార్‌కార్డు వివరాలను బట్టి జాబ్‌ కార్డును సవరణ చేసి వినియోగంలోకి తెస్తాం. 
– డాక్టర్‌ పెంటయ్య, డీఆర్‌డీఓ, సూర్యాపేట  

మరిన్ని వార్తలు