కిస్తీ కట్టకపోతే ఫోన్‌ లాక్‌ అయిపోతుంది మరి!

14 Jun, 2021 08:07 IST|Sakshi

మైక్రో ఫైనాన్స్‌ కంపెనీల కొత్త ఎత్తుగడ

ఏం జరిగిందో అర్థం కాక అయోమయంలో వినియోగదారులు 

ముమ్మాటికీ నేరమే అంటున్న సైబర్‌ నిపుణులు 

‘మీరు ఈ నెల వాయిదా చెల్లించని కారణంగా మీరు మొబైల్‌ ఫోన్‌ వినియోగించలేరు. వెంటనే ఫైన్‌ సహా వాయిదా చెల్లించండి’ అంటూ కరీంనగర్‌కు చెందిన ఓ యువకుడి ఫోన్‌కి సందేశం వచ్చింది. వెంటనే ఫోన్‌ పనిచేయడం ఆగిపోయింది. సిద్దిపేట సమీపంలో ఉండే మరో యువకుడి ఫోన్‌ అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయింది. ఇన్‌కమింగ్‌ ఫోన్‌ నంబర్లు మినహా మరే ఆప్షన్‌ పనిచేయట్లేదు. వెంటనే ఈనెల కిస్తీ చెల్లించాలన్న సందేశం మాత్రం ఫోన్‌ స్క్రీన్‌పై కనబడుతోంది. 

సాక్షి, హైదరాబాద్‌: తమ వద్ద అప్పు తీసుకున్న వారిని మైక్రోఫైనాన్స్‌ కంపెనీలు రకరకాలుగా ముప్పు తిప్పలు పెడుతుంటాయి. తాజాగా నెల వాయిదా చెల్లించకపోతే ఫోన్లను కూడా లాక్‌ చేస్తూ చుక్కలు చూపుతున్నాయి. అంటే ఆ సంస్థల వద్ద అప్పు తీసుకుని మొబైల్‌ ఫోన్‌ కొనుక్కుంటే ఫోన్‌ పేరుకే మనం వాడుతాం. కానీ ఎప్పుడంటే అప్పుడు దాన్ని పనిచేయకుండా చేయగలవు ఆ కంపెనీలు. తమ వద్ద రుణం తీసుకుని ఫోన్‌ కొన్న వారెవరైనా నెల వాయిదా చెల్లించకుంటే ఫోన్‌ పనిచేయకుండా చేస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందో వినియోగదారులకు అర్థం కావట్లేదు. తమ ఫోన్‌ హ్యాక్‌కు గురైందా లేదా ఏదైనా సాఫ్ట్‌వేర్‌ సమస్య వచ్చిందా? వైరస్‌ దాడి చేసిందా అన్న విషయం తెలియక తలలు పట్టుకుంటున్నారు. 

జిల్లాలు, గ్రామాలపైనే టార్గెట్‌.. 
వాస్తవానికి మైక్రో సంస్థలు సెల్‌ఫోన్లు కొనుక్కునేందుకు రుణాలు ఇవ్వడం కొత్తేం కాదు. హైదరాబాద్‌ వంటి నగరాల్లో ప్రజలంతా క్రెడిట్‌ కార్డులు వాడుతుంటారు. అందుకే, మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలు జిల్లాల్లో తమ మార్కెట్‌ను విస్తరించుకుంటున్నాయి. ఇందులో భాగంగా సెమీ అర్బన్, రూరల్‌లోని జిల్లా కేంద్రాలు, చిన్న పట్టణాలు, టౌన్లలోని మొబైల్‌ షాపుల్లో వీరి ఏజెంట్లు ఉంటారు. ఏజెంట్లు షాపు నిర్వాహకులకు మధ్య ముందే వ్యాపార అవగాహన ఉంటుంది. అందుకే ఫోన్లు కొనేందుకు వచ్చినవారికి వారి బడ్జెట్‌ కంటే అధిక ధర ఉన్న ఫోన్లను చూపిస్తారు. అప్పుడే ఫైనాన్స్‌ కంపెనీ ఏజెంట్‌ సీన్‌లోకి వస్తాడు. సార్‌.. తక్కువ వడ్డీతో మంచి ఫోన్‌ తీసుకోండి అంటూ ఆఫర్లతో ఊరిస్తాడు. వినియోగదారుడు సరే అనగానే.. అతడితో కొన్ని సంతకాలు తీసుకుంటారు. ఆ పత్రాల్లో ఎక్కడో చిన్నగా నెల వాయిదా చెల్లించకపోతే హ్యాండ్‌సెట్‌ లాక్‌ అవుతుందని నిబంధన ఉంటుంది. ఆ నిబంధనలు ఇంగ్లిష్‌లో ఉండటం, గ్రామీణులకు ఇంగ్లిష్‌ రాకపోవడం, షాపింగ్‌ ముగించుకునే తొందరలో ఉండటంతో చాలామంది ఈ షరతులను చదవడం లేదు. 

అన్యాయం అంటున్న వినియోగదారులు.. 
‘నేను వృత్తిరీత్యా పలు ఊర్లు తిరుగుతాను. వాస్తవానికి నెల వాయిదా కట్టడం మర్చిపోయాను. ఎలాంటి అలర్ట్, వార్నింగ్‌ సందేశాలు లేకుండా.. పనిలో ఉండగా ఉన్నట్లుండి నా ఫోన్‌ లాక్‌ అయింది. నేను వెంటనే చెల్లించాను. కానీ, మూడు రోజుల పాటు నా ఫోన్‌ను తిరిగి అన్‌లాక్‌ చేయలేదు. ఈ మూడు రోజులు నేను తీవ్రంగా ఇబ్బంది పడ్డాను. ‘ఫోన్‌ పే, గూగుల్‌పేతో పాటు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ మొత్తం స్తంభించిపోయింది. దీంతో నేను చాలా ఇబ్బందులు పడ్డాను’అని వాపోయాడు.

ఎక్కడో ఉండి తమ ఫోన్‌ను ఆపరేట్‌ చేస్తున్నారంటే.. ఇది చట్ట విరుద్ధమే కదా అని ఆవేదన వ్యక్తం చేశాడు. లాక్‌డౌన్‌ కారణంగా రెండు, మూడు నెలలుగా ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న వేళ ఫోన్లు లాక్‌ చేయడం అన్యాయమని వినియోగదారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ విషయంపై హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులను సంప్రదించగా.. ఫోన్లు లాక్‌ అయ్యాయన్న ఫిర్యాదులు తమ వద్దకు రాలేదని సమాధానమిచ్చారు. ఈ చర్య ముమ్మాటికీ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని, తీవ్రమైన విషయంగా పరిగణించాలని ప్రముఖ సైబర్‌ అనలిస్ట్‌ అనిల్‌ రాచమల్ల అన్నారు.  

చదవండి: రేషన్‌ కార్డుకు రేటు!

మరిన్ని వార్తలు