మళ్లీ నగరం బాట పడుతున్న వలసజీవులు

27 Aug, 2020 08:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో ఉపాధిపై భరోసా లేక బతుకుజీవుడా అంటూ సొంతూరు బాటపట్టిన  వలస జీవులు తిరిగి నగర బాట పడుతున్నారు. కొన్ని నెలల క్రితం స్వస్థలాలకు వెళ్లిన వలస కార్మికులకు ప్రస్తుతం అక్కడ సైతం ఉపాధి కరువైంది. ఆర్థిక పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. తమ సొంతవారిని కలిశామన్న తృప్తి తప్ప చేసేందుకు తగినంత పని లేకుండా పోయింది. కుటుంబ పోషణ కష్టమైంది. నగరంలో కోవిడ్‌ ఉద్ధృతి తగ్గకున్నా.. గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్లీ వచ్చేందుకు కొందరు సిద్ధమవుతుండగా.. మరికొందరు కరోనా కేసులు పెరుగుతుండటంతో వెనక్కి రావడానికి ఇష్టపడటం లేదు. కొందరు రావడానికి రెడీ అవుతున్నా వారి కుటుంబ సభ్యులు అడ్టుకుంటున్నారు. అయినా పాత పనులకు సై అంటున్నారు. 

పరిస్థితులు తారుమారు.. 
కరోనా మహమ్మారితో పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రస్తుతం వలస కూలీల కొరత ఏర్పడింది. భవన నిర్మాణ కార్మికుల కొరత కాంట్రాక్టర్లను వేధిస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో నిర్మాణ పనులు ఆగిపోయాయి. స్థిరాస్తి రంగం పడిపోయింది. అమ్మకాలు విపరీతంగా తగ్గాయి.. వలస కూలీలు లేకుంటే పనులు జరగవు. దీంతో వెనక్కి రప్పించడానికి కాంట్రాక్టర్లు తీవ్రంగా తంటాలు పడుతున్నారు. మునుపటి కంటే ఎక్కువ జీతం, ఉచిత గది, ఇతర సౌకర్యాలు వంటివి కల్పిస్తామని చెబుతున్నారు. దీంతో కొంతమంది వలస కూలీలు తిరిగి వస్తుండటంతో నిర్మాణ రంగం, సూక్ష్మ పరిశ్రమలకు జీవం వస్తోంది. తాజాగా వివిధ మార్గాల్లో  వలసజీవులు తిరిగి వస్తుండటంతో భవన నిర్మాణ రంగం కాంట్రాక్టర్లు, సూక్ష్మ పరిశ్రమల యాజమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు