మ‘కామ్‌’ మారింది!

19 Nov, 2020 08:43 IST|Sakshi

కరోనాతో జీవన గమనంలో మార్పులు

అండగా నిలిచిన సొంత గ్రామాలు

స్థానికుల భరోసాతో కొత్త ఉపాధి

సాక్షి, మెదక్‌: వారికి పట్నంలో పనిలేదు.. మనీ లేదు. ఉన్నపణంగా ఉపాధి పోయింది. ఉన్నట్టుండి రోడ్డున పడ్డారు. కుటుంబ పోషణ గగనమైంది. కరోనా కాటుకు వలసకూలీలు విలవిలలాడారు. కట్టుబట్టలతో, ఖాళీకడుపులతో ఊరిబాటపట్టారు. హైదరాబాద్‌ నగరంలో విపత్కర పరిస్థితులను తట్టుకోలేక సొంతూళ్లకు వచ్చిన చాలామంది స్థానికుల అండతో కొత్త ఉపాధిని వెతుక్కుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వైరస్‌ ప్రభావం తగ్గినా పట్టణాలకు తరలిపోకుండా సొంత గ్రామం లేదా జిల్లాలో స్థిర నివాసం ఏర్పరచుకొని తోచిన వ్యాపారం చేస్తూ, కూలిపని చేసుకుంటూ కుటుంబాలను సాకుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విద్యావంతులైన నిరుద్యోగులు పలువురు సొంతంగా చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకోగా ఇతరులు పలు షాపుల్లో పనులకు వెళ్తూ పొట్టపోసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

రేషన్‌ పోర్టబిలిటీ లెక్కలే నిదర్శనం
రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఏ రేషన్‌ దుకాణం నుంచైనా రేషన్‌ సరుకులు తీసుకునే(పోర్టబిలిటీ) వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కలిపించని విషయం తెలిసిందే. కరోనాకు ముందు ప్రస్తుతం పోర్టబిలిటీ సేల్‌ను పరిశీలిస్తే అధిక మొత్తంలో ప్రజలు సొంతూళ్లలోనే ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మార్చి 22న జనతా కర్ఫ్యూ, వెంటనే లాక్‌డౌన్‌ అమల్లోకి రాగా ఆ తర్వాత విడతలవారీగా అన్‌లాక్‌ చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో, ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్‌లో ఉద్యోగాలు చేస్తున్న వందలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. లాక్‌డౌన్‌తో పనుల్లేక వలస కూలీలు సొంత జిల్లాలకు తరలివచ్చారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టినప్పటికీ స్థానికంగానే ఉపాధి పొందుతున్నారు. మెదక్‌ జిల్లాలో కరోనాకు ముందు ఫిబ్రవరిలో రేషన్‌ పోర్టబిలిటీ కింద 18,825 మంది ఇతర ప్రాంతాల లబ్ధి దారులు రేషన్‌ సరుకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 30,096కు చేరింది. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోనూ గమనించవచ్చు.

మరిన్ని వార్తలు