ముంబై నుంచి తెలంగాణ: ఈ జర్నీ చాలా కాస్ట్‌లీ గురూ!

19 Apr, 2021 13:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా భయంతో సొంతూళ్లకు బయలుదేరిన వలసజీవికి ఎంత కష్టం.. ఎంత నష్టం! పట్నంలో ఉండలేమని పల్లెబాట పట్టినవారికి ఎంత కష్టం.. ఎంత నష్టం! వారిని ప్రైవేట్‌ బస్‌ ఆపరేటర్లు నిలువుదోపిడీ చేస్తున్నారు. టికెట్ల ధరలు విపరీతంగా పెంచి ఇక్కట్ల పాలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఉన్న ముంబై నగరం నుంచి తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చేరాల్సిన తమకు ఈ బస్సుల్లో ప్రయాణించే పరిస్థితిలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంబై నుంచి రోజుకు వేలాది మంది తెలంగాణకు వస్తున్నారు.

ఇందులో చాలామంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రైళ్లలో సీట్లు దొరకనివారు, అత్యవసరంగా వెళ్లాలనుకున్నవారు మాత్రం బస్సులను ఆశ్రయిస్తున్నారు. వలసజీవుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు ఆపరేటర్లు ముంబై నుంచి నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల వరకు అమాంతం టికెట్‌ ధరలు పెంచేశారు. రూ.700 ఉన్న టికెట్‌ ధరను రూ.1200లకు, రూ.900 ఉన్న టికెట్‌ను రూ.1,800–2,000 వరకు పెంచారని వలసకారి్మకులు వాపోతున్నారు. ముంబై నుంచి రైల్లో నిజామాబాద్‌ వరకు స్లీపర్‌లో వెళితేనే రూ.400 టికెట్‌ ఉందని, కానీ ఈ బస్సుల్లో సిట్టింగ్‌కే విపరీతంగా వసూలు చేయడంతో బస్సులు ఎక్కాలంటే భయమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా విపరీతంగా వసూలు చేయడమే కాకుండా ముంబై దాటిన తర్వాత చంబూరు, మాన్కూరు వద్ద పుణె వెళ్లే ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారని, మధ్యలో సీట్లు వేసి కూర్చోబెడుతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. బస్సు కిటకిటలాడే విధంగా ప్రయాణికులను ఎక్కించడమే కాకుండా కనీసం శానిటైజర్లు కూడా బస్సుల్లో ఉంచడం లేదని చెబుతున్నారు. దీనికితోడు బస్సుల్లో విపరీతమైన దుర్గంధం వస్తోందని అంటున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే దిగి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని, ఏం చేయలేని పరిస్థితుల్లో సొంత గ్రామాలకు వెళ్లేందుకు వేరే అవకాశం లేక ప్రైవేట్‌ బస్సులను ఆశ్రయిస్తున్నామని వాపోతున్నారు.  

రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి
‘ముంబై నుంచి తెలంగాణలోని సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్న వలసజీవులను ప్రైవేటు బస్‌ ఆపరేటర్లు దోపిడీ చేస్తున్నారు. అమాంతం టికెట్‌ ధరలు పెంచి ఇష్టమైతే బస్‌ ఎక్కాలని, లేదంటే వెళ్లిపోవాలని హుకూం జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఐదు ప్రైవేటు ట్రావెల్స్‌ అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నాయి. రెండింతల ధర పెంచి ముక్కు పిండి వసూలు చేస్తున్న ఆపరేటర్లు బస్సుల్లో కనీసం కరోనా నిబంధనలు పాటించడం లేదు. ప్రయాణించినంత సేపు దుర్గంధం మధ్య ఉండాల్సి వస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఈ దోపిడీని అరికట్టాలి’      
– మూల్‌నివాసి మాల, తెలంగాణ జేఏసీ చైర్మన్, ముంబై

చదవండి: కరోనా విలయం: ఢిల్లీలో లాక్‌డౌన్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు