పప్పు.. పాలు.. గుడ్లు.. టెండర్ల ఖరారు ఎలా?

15 May, 2023 08:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల కింద సరుకుల పంపణీకి కాంట్రాక్టర్ల ఎంపిక అధికార యంత్రాంగానికి ప్రహసనంగా మారింది. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను ఖరారు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం టెండరులో పాల్గొంటున్న బిడ్డర్లు అత్యధిక ధరలు కోట్‌ చేయడమే. బిడ్డర్లు కుమ్మక్కై వాస్తవ ధరల కంటే అత్యధిక ధరలను కోట్‌ చేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తీరును అధికారులు గుర్తించడంతో కాంట్రాక్టరు ఎంపిక వాయిదా పడుతూ వస్తోంది. దాదాపు రెండు నెలలుగా ఒక్క టెండరు సైతం ఖరారు కాలేదు.

వన్‌.. టూ.. త్రీ..
అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన గర్భిణులు, బాలింతలు, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులకు ఆరోగ్యలక్ష్మి తదితర పోషకాహార కార్యక్రమాల్లో భాగంగా పాలు, కోడి గుడ్లు, కందిపప్పును వివిధ రూపాల్లో అందిస్తున్నారు. సంపూర్ణ పోషకాహారం కింద పాలను, గుడ్లను నేరుగా అందిస్తుండగా... ఫుల్‌ మీల్స్‌లో భాగంగా కందిపప్పుతో కూడిన కూరలతో భోజనాన్ని ఇస్తున్నారు. ఈ పథకాలకు అవసరమైన పాలు, గుడ్లు, కందిపప్పును సరఫరా చేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తుంది.మూడు లేదా ఆరు నెలల పాటు ఈ కాంట్రాక్టును అప్పగించి సరుకులను స్వీకరిస్తుంది.

తక్కువ ధరల కోసం..
ఈ క్రమంలో మార్కెట్‌ ధరల కంటే తక్కువ ధరలో సరుకుల కొనుగోలు లక్ష్యంగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్లు చేపట్టింది. కానీ ఇందులో పాల్గొంటున్న వారంతా మార్కెట్‌ ధర కంటే అత్యధిక ధరలను కోట్‌ చేస్తూ రావడంతో సర్కారు ఖజానాకు భారీగా గండి పడుతుందన్న భావనతో ఆ శాఖ టెండర్లను రద్దు చేస్తూ వస్తోంది.

అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరా కోసం ఈ ఏడాది మార్చిలో మొదటిసారి, ఏప్రిల్‌ మొదటి వారంలో రెండోసారి టెండరు పిలిచారు. కానీ అందులో పాల్గొన్న సంస్థలు నిబంధనలకు సరితూగలేదు. దీంతో రెండు టెండర్ల ద్వారా అర్హులు ఎంపిక కాకపోవడంతో మరో టెండరు పిలవాల్సి వచి్చంది. ఈ క్రమంలో పాల పంపిణీకి ఇబ్బందులు కలగకుండా ఇప్పటివరకు పంపిణీ చేసిన సంస్థకు పాత ధరలోనే పంపిణీ చేసేలా అవకాశమిస్తూ ఆర్నెళ్లకు పొడిగిస్తూ రాష్ట్ర మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సెపె్టంబర్‌ వరకు పంపిణీకి అవకాశం దక్కినట్లయింది.

కందిపప్పు పంపిణీకి మార్చి నెలాఖరులోనే టెండరు పిలిచింది. గత టెండరు సమయంలో కిలోకు రూ.114 చొప్పున పంపిణీ చేయగా... ఈ సారి టెండర్లు ఓ కనిష్ట ధర(ఎల్‌–1)ను రూ.145 కోట్‌ చేసింది. ఇక గరిష్ట ధర కింద ఏకంగా రూ.175 చొప్పున కోట్‌ చేశారు. గత ధర కంటే భారీగా ధరలు పెంచిన కారణంగా ఆ టెండరును రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రద్దు చేసింది. కొత్తగా మరో టెండరును పిలిచినప్పటికీ ధరలు ఆదే స్థాయిలో ఉండడంతో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

కోడిగుడ్ల పంపిణీకి సంబంధించిన టెండరులో జిల్లాల వారీగా పంపిణీ దారుల ఎంపికకు టెండరు పిలిచింది. దీనిపై పలు పౌల్ట్రీ సంస్థల యజమానులు న్యాయపోరాటానికి ఉపక్రమించారు. కోర్టు కేసులు నమోదు చేయగా... కొన్నాళ్లుగా ఎంపిక ప్రక్రియ ముందుకు కదల్లేదు. తాజాగా వీటన్నింటినీ పరిష్కరించి కాంట్రాక్టర్లను ఎంపిక చేసేందుకు సీఎం కార్యాలయాధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ఆ పోస్టులకు ఏజ్‌ భారమైంది! వైద్య విద్య విభాగంలో ‘వయో పరిమితి’సంక్షోభం 

మరిన్ని వార్తలు