Obesity Risk: మిల్లెట్స్‌ మాయ! ఆ జబ్బులకు తిండే కారణం!!

19 Aug, 2021 09:00 IST|Sakshi

రుచికి రుచీ, బరువు తగ్గేందుకు  కూడా చిరుధాన్యాలు

సాక్షి, హైదరాబాద్‌: చిరుధాన్యాలు రుచిగా ఉండటమే కాకుండా బరువు తగ్గేందుకు దోహదపడతాయని ఇటీవలే నిర్ధారించిన మెట్టప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌) తాజాగా మరో కొత్త విషయాన్ని గుర్తించింది. చిరుధాన్యాలను తరచూ తినడం వల్ల శరీరంలోని మొత్తం కొలెస్ట్రాల్‌తో పాటు, హానికారక ట్రైగ్లిజరైడ్స్‌ మోతాదునూ తగ్గిస్తాయంది. వివిధ దేశాలకు చెందిన ఐదు సంస్థలు ఇక్రిశాట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అధ్యయయనంలో ఇప్పటికే జరిగిన 19 పరిశోధనల ఫలితాలను విశ్లేషించారు. ఫలితాలను ఫ్రాంటియర్స్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఊబకా యం, మధుమేహం, గుండె జబ్బులను ఆహారంతోనే నివారించే అవకాశాన్ని చిరుధాన్యాలు ఇస్తున్నందున వీటికి మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో తాము వాటి శాస్త్రీయ విశ్లేషణ చేపట్టామని ఇక్రిశాట్‌ తెలిపింది. 

చెడు కొవ్వులకు చెక్‌.. 
చిరుధాన్యాలను తరచూ తిన్నవారిలో మొత్తం కొలెస్ట్రాల్‌ మోతాదు 8% వరకు తగ్గిందని, అదే సమయంలో హానికారక లోడెన్సిటీ లిపోప్రోటీన్‌ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌), ట్రైగ్లిజరాల్‌ కూడా 10% వరకు తగ్గినట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఫలితంగా అధ్యయనం చేసిన వ్యక్తుల కొవ్వు మోతాదులు అసాధారణ స్థాయి నుంచి సాధారణ స్థాయికి చేరాయని, పైగా చిరుధాన్యాలతో డయాస్టోలిక్‌ రక్తపోటు కూడా 7% వరకు తగ్గినట్లు అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఎస్‌.అనిత తెలిపారు.బరువు తగ్గేందుకే కాకుండా గుండెకూ మేలు ∙చిరుధాన్యాలపై ఇక్రిశాట్‌ అధ్యయనంలో వెల్లడి

తిండే కారణం: డాక్టర్‌ హేమలత 
గుండెజబ్బులు, మధుమేహం వంటివి పెరిగేందుకు అనారోగ్యకరమైన ఆహారం ప్రధాన కారణమని, చిరుధాన్యాలను తినడం ద్వారా ఈ సమస్యను కొంతమేరకైనా అధిగమించొచ్చని ఇక్రిశాట్‌ అధ్యయనంలో భాగం వహించిన జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.హేమలత తెలిపారు. భారతీయుల ఆహారంలో చిరుధాన్యాలు ప్రధాన భాగం అయ్యేందుకు తద్వారా మధుమేహం, గుండెజబ్బులను తగ్గించేందుకు ఈ అధ్యయనం సాయపడుతుందని అన్నారు. కాగా, మెరుగైన వంగడాలు రూపొందిస్తే చిన్న, సన్నకారు రైతులకు మేలు జరుగుతుందని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జాక్వెలిన్‌ హ్యూగ్స్‌ తెలిపారు. ఇక్రిశాట్, ఎన్‌ఐఎన్‌తో పాటు యూనివర్సిటీ ఆఫ్‌ రీడింగ్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్, న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌ (యూకే), జపాన్‌కు చెందిన కోబెయూనివర్సిటీలు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నాయి.

మరిన్ని వార్తలు