కనీస అర్హత మార్కులు లేకపోతే ఎలా?

24 Jun, 2021 08:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇంటర్‌లో 35 శాతం మార్కులతో ఉన్నత కోర్సుల్లో ప్రవేశాలు కష్టం 

1,99,019 మంది ఉత్తీర్ణులు కాని, పరీక్షలు రాయని విద్యార్థుల్లో గుబులు 

50 వేల మంది ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌ విద్యార్థులపైనా ప్రభావం 

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీలో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్‌లో ఉండాల్సిన కనీస అర్హత మార్కులైన 45 శాతం లేకపోతే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ఫెయిలైన, పరీక్షలు రాయని సబ్జెక్టుల్లో 35 శాతం మార్కులను ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో పాస్‌ అయిన సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులనే ద్వితీయ సంవత్సరంలో ఇవ్వనున్నారు. దీంతో ఫెయిలైన, పరీక్షలు రాయని వారి విషయంలో నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. గతేడాది ప్రథమ సంవత్సరంలో 1,99,019 మంది ఫెయిలైన లేదా పలు సబ్జెక్టుల పరీక్షలు రాయని వారున్నారు. వారిలో కొంతమంది ఒకట్రెండు సబ్జెక్టులు ఫెయిల్‌ కాగా, కొంతమంది మూడు నాలుగు ఫెయిలైన వారున్నారు. మరోవైపు పరీక్షలు రాయని వారూ ఉన్నారు. ఇప్పుడు వారందరికి ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం చొప్పున మార్కులనే ఇస్తే నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. 

ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌లో.. 
మరోవైపు ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ కూడా ఇంటర్మీడియెట్‌ బోర్డు ఇచ్చే మార్కుల ప్రకారమే తమ పరిధిలోని ఓపెన్‌ ఇంటర్‌ విద్యార్థులకు మార్కులను కేటాయించాలని భావిస్తోంది. వారికీ 35 శాతం మార్కులను కేటాయించే అవకాశం ఉంది. దీంతో 50 వేల మంది విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. కరోనా కారణంగా గతేడాది 40 వేల మంది ఓపెన్‌ ఇంటర్‌ విద్యార్థులకు 35 శాతం మార్కులే ఇవ్వడం వల్ల రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేటు, డీమ్డ్‌ యూనివర్సిటీల్లోని డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, లా వంటి కోర్సుల్లో ప్రవేశాలు పొందలేక పోయారు. 35 శాతం కనీస మార్కులు వేయడం వల్ల పాస్‌ అయ్యారే తప్ప ఉన్నత కోర్సుల్లో చేరలేకపోయారు. 

ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రవేశాలకే సమస్య.. 
అగ్రికల్చర్, లా, మెడిసిన్, ఇంజినీరింగ్, ఇతర డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. ప్రభుత్వ ఆధీనంలోని జాతీయస్థాయి విద్యా సంస్థలు, రాష్ట్రంలో ఎంసెట్‌కు ఆ నిబంధనను తొలగించినా ప్రైవేటు విద్యాసంస్థలు దానిని కొనసాగిస్తున్నాయి. జేఈఈ వంటి పరీక్షలు రాసేందుకు, ఐఐటీల్లో చేరేందుకు 45 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను కరోనా కారణంగా తొలగిస్తున్నట్లు గతేడాది కేంద్రం ప్రకటించింది. ప్రైవేటు విద్యా సంస్థలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, ప్రైవేట్‌ యూనివర్సిటీలు అందుకు ఒప్పుకోవడంలేదు. ఇంటర్‌ బోర్డు వర్గాలు మాత్రం 45 శాతంలోపే మార్కులు ఉండే విద్యార్థులు చాలా తక్కువ మంది ఉంటారని చెబుతున్నాయి. అలాంటి వారి విషయంలో ప్రత్యామ్నాయం ఆలోచించవచ్చని పేర్కొంటున్నాయి. ప్రాక్టికల్‌ మార్కులను 100 శాతం ఇస్తున్నందున ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపితే 45 శాతం కంటే తక్కువ మార్కులొచ్చే విద్యార్థులు తక్కువే ఉంటారని చెబుతున్నాయి. ఓపె¯న్‌ ఇంటర్‌ ఏడాది కోర్సే కావడంతో వారికి 35 శాతం మార్కులిస్తే నష్టం తప్పేలా లేదు.  

ప్రతి విద్యార్థికీ న్యాయం జరిగేలా చూడాలి 
కనీస మార్కుల విధానం విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. కరోనా కారణం గా పరీక్షలు నిర్వహించనందున ప్రతీ విద్యార్థికి న్యాయం జరిగేలా చూడాలి. 45 శాతం కనీస మార్కులను ఇస్తే ఇబ్బందేమీ లేదు. తద్వారా ప్రతి విద్యార్థికీ మేలు జరుగుతుంది. – డాక్టర్‌ పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు

మరిన్ని వార్తలు