స్వచ్ఛ భారత్‌లో మరోసారి తెలంగాణ సత్తా

1 Mar, 2023 04:03 IST|Sakshi

స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ అవార్డుల్లో హవా

మంత్రి ఎర్రబెల్లి వెల్లడి.. అవార్డులు గెలిచిన జిల్లాల అధికారులకు అభినందన 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/సాక్షి హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ప్రకటిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. రెండు వేర్వేరు విభాగాల్లో మొదటి మూడు స్థానాలకుగాను రెండు స్థానాలు సాధించి దేశంలోనే నంబర్‌వన్‌గా మళ్లీ నిలిచింది. 2022 అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికానికి, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఎంపిక చేసిన రెండు విభాగాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా నిలిచింది.

స్టార్‌ త్రీ విభాగంలో తెలంగాణలోని సిద్దిపేట జిల్లా, జగిత్యాల జిల్లాలు దేశంలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. మూడో స్థానంలో కేరళలోని కొట్టాయం జిల్లా నిలిచింది. స్టార్‌ ఫోర్‌ విభాగంలో తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, 2వ స్థానంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ జిల్లా నిలవగా, 3వ స్థానాన్ని తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా దక్కించుకుంది. గతంలోనూ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రకటించిన ప్రతి అవార్డు విభాగంలోనూ తెలంగాణ మొదటి మూడు స్థానాల్లో నిలిచింది.

గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అనేక అవార్డులు సాధించింది. మంగళవారం హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. నిధులు ఇవ్వకున్నా, అవార్డులు ఇస్తున్నందుకు కేంద్రానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.

పల్లెప్రగతి వంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌ దార్శనికత వల్లే ఈ అవార్డులు దక్కుతున్నాయన్నారు. ఈ అవార్డులు రావడంలో ఉన్నతాధికారుల నుంచి గ్రామ సిబ్బంది వరకు అందరి కృషి ఉందని కొనియాడారు. కాగా, అదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కె గ్రామ సర్పంచ్‌ మీనాక్షికి మార్చి 4న ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందజేస్తారని ఎర్రబెల్లి తెలిపారు.   

మరిన్ని వార్తలు