ఆకుపట్టి.. కల్లు తాగిన మంత్రి.. టేస్ట్ సూపరుంది!

8 Nov, 2022 15:04 IST|Sakshi

సాక్షి, పాలకుర్తి(జనగాం జిల్లా): రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కల్లు తాగారు. కుండతో కల్లు వంచుతుంటే.. మంత్రి ఆకుపట్టి కల్లు సేవించి సురాపానకం టేస్ట్ సూపరుందని గౌడ్‌ను అభినందించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి, అయ్యంగార్‌పల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. సమస్యలు అడిగి తెలుసుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు.

దారిలో తాటివనం వద్ద గౌడ్ కులస్తులను చూసి కారు ఆపి చెట్ల కిందకు చేరారు మంత్రి. ఈత చెట్టు కింద కూర్చొని నీరాకల్లు సేవించారు. ప్రకృతి సిద్ధమైన ఔషధం నీరా కల్లు అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గౌడ సంక్షేమానికి నీరాకల్లును ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే నీరా కల్లు ఇచ్చే ఈత చెట్లను అన్ని గ్రామాల్లో పెట్టిస్తున్నట్లు తెలిపారు.

గ్రామాల్లో కొందరు చీడపురుగులు ఉంటారని, చేసింది చెప్పకుండా చేయంది ఏగేసి చెప్పడంతో ప్రజలు అదే నిజమని నమ్ముతారని తెలిపారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్కరి బతుకులు బాగుపడ్డాయని, రైతుల కోసం 20 వేల కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌ను ఎవరైనా విమర్శిస్తే రైతులే సరైన సమాధానం చెప్పాలని కోరారు.
చదవండి: మునుగోడు ఫలితాలు.. లెక్క తప్పిందెక్కడ?

మరిన్ని వార్తలు