తెలంగాణలో ఆక్సిజన్‌ కొరత లేదు: మంత్రి ఈటల

27 Apr, 2021 18:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.  260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటే.. 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సిద్ధంగా ఉందన్నారు. పీఎం కేర్ నిధులతో తెలంగాణలో 12 ఆక్సిజన్ తయారీ కేంద్రాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా రాకముందు 14 వందల బెడ్స్ కి మాత్రమే ఆక్సిజన్ సదుపాయం ఉండేదని, ప్రస్తుతం 10 వేల బెడ్స్‌కు ఆక్సిజన్ సదుపాయం ఉందన్నారు. 700 ఐసీయూ బెడ్స్ కలిగిన గాంధీ ఆస్పత్రి దేశంలోనే పెద్దదని, మరో వారం రోజుల్లో 3010 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.

ఇతర రాష్ట్రాల పేషంట్లతో ప్రయివేటు ఆస్పత్రులు నిండిపోయాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 350 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో కేసులు తగ్గుముఖం పట్టిందని, తెలంగాణలో కూడా తగ్గుతాయని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్‌కి ధరలు నిర్ణయించామని తెలిపారు. అయితే ప్రైవేటు ఆస్పత్రుల ఉల్లంఘన కనిపిస్తుందన్న మంత్రి పెద్దమొత్తంలో డిపాజిట్ చేసుకున్న తర్వాతే వైద్యం చేస్తున్నారని మండిపడ్డారు.

బిల్లు కట్టలేదని శవాన్ని ఇవ్వడం లేదని, వ్యాపార కోణంలో ప్రజలను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని హెచ్చరించారు. ప్రైవేటు ఆస్పత్రులను సీజ్ చేయడం ప్రభుత్వ ఉద్దేశ్యం కాదని, ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని మంత్రి ఆదేశించారు. మరోవైపు రాష్ట్రాలనే వ్యాక్సిన్ కొనుగోలు చేయాలని కేంద్రం అనడం భావ్యం కాదని, కేంద్రానికి, రాష్ట్రాలకు వ్యాక్సిన్ ధరలు వేరువేరుగా ఉండటం ఏంటని ప్రశ్నించారు. 18 ఏళ్ళు పైబడిన వారు వ్యాక్సిన్ మీరే కొనుగోలు చేయాలని చెప్పడం ఘోరమైన చర్యగా అభివర్ణించారు.

చదవండి: వైద్యారోగ్యశాఖకు సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు