నివారణ చర్యలు చేపట్టండి

7 Aug, 2020 04:43 IST|Sakshi

కరోనాపై కలెక్టర్లకు మంత్రి ఈటల ఆదేశం 

ఇంట్లో చికిత్స పొందే రోగులను పర్యవేక్షించండి 

సరైన చికిత్స అందించి భరోసా కల్పించాలి

సాక్షి, హైదరాబాద్‌: మంత్రుల సూచనలు, సలహాలతో జిల్లాల్లో కరోనా నివారణచర్యలు చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు మంత్రి ఈటల, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ జిల్లాల్లో కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌పై కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మం త్రి మాట్లాడుతూ హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగుల ఆరోగ్యపరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, వారి కి డాక్టర్లతో కౌన్సెలింగ్‌ ఇప్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. కోవి డ్‌ బాధితులందరికీ అవసరమైన చికిత్స అందిం చి వారిలో భరోసా కల్పించాలని సూచించారు. కరోనా వైరస్‌ కట్టడికి అందరూ కలసికట్టుగా కృషి చేయాలని పేర్కొన్నారు. 

కొత్త టెస్టింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధం 
కరోనా టెస్ట్‌ల కోసం వచ్చిన ప్రతిఒక్కరికీ పరీక్ష చేయాలని, వారి వివరాలను యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సోమేశ్‌కుమార్‌ సూచించారు. పేషెంట్లకు కౌన్సెలింగ్‌తోపాటు మెడికల్‌ కిట్‌ను అందజేయాలన్నారు. కొత్త టెస్టింగ్‌ సెంటర్ల ఏర్పాటు, వైద్యులు, మెడికల్‌ సిబ్బంది తాత్కాలిక నియామకానికి ప్రతిపాదనలు పంపితే అనుమతులు ఇస్తామని చెప్పారు. జిల్లా, ఏరియా ఆస్పత్రులు, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల అనుబంధ ఆస్పత్రుల్లో ఉన్న అన్ని బెడ్లకు ఆక్సిజన్‌ సదుపాయం కల్పించడానికిగాను ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కరుణ, కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) మెంబర్‌ సెక్రటరీ నీతూ ప్రసాద్, పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు, ఆర్థిక శాఖ స్పెషల్‌ సెక్రటరీ రోనాల్డ్‌ రోస్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు