ఆరోగ్యశ్రీలో సంస్కరణలు 

1 Oct, 2020 02:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీలో సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీని బలోపేతం చేయడానికి, లీకేజీలు అరికట్టడానికి ఒక కమిటీ వేసి నివేదిక అందించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధికారులను ఆదేశించారు. పాత పద్ధతులను పక్కన పెట్టి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విధివిధానాలు తయారు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై బుధవారం మంత్రి ఈటల రాజేందర్‌ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.

వివిధ జబ్బులకు చికిత్స విధానాలను, చెల్లిస్తున్న సొమ్మును ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా క్రమబద్ధీకరించాలన్నారు. ఆరోగ్య శ్రీ జాబితాలోని ఏదైనా ప్రైవేట్‌ ఆసుపత్రి చికిత్స చేయడానికి నిరాకరిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. అటువంటి ఆసుపత్రుల మీద ఫిర్యాదు చేయడానికి 104కి ఫోన్‌ చేయాలని ప్రజలకు మంత్రి సూచించారు. మోసం చేసే ఆసుపత్రుల మీద ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ప్రజాధనం వృ«థా కాకుండా చూడాలన్నారు.  

ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా చర్యలు 
ఒక రోగి ఆరోగ్యశ్రీ కింద చేరితే ఇంటికి వెళ్లేంతవరకు పూర్తి ఉచితంగా చికిత్స అందించాలే తప్ప మంచి పరికరాలు వేస్తామని, మంచి రూమ్‌ ఇస్తామని కారణాలు చెప్పి ఆసుపత్రులు డబ్బులు వసూలు చేయకుండా చూడాలని మంత్రి ఈటల సూచించారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి విజిలెన్స్‌ టీంలను ఏర్పాటు చేయాలన్నారు. చికిత్స పొందిన వారి ఫీడ్‌బ్యాక్‌ తీసుకొని అవసరమైతే సంబంధిత ఆసుపత్రిని ఆరోగ్యశ్రీ జాబితా నుండి తొలగించాలన్నారు. ఆరోగ్యశ్రీ వార్డు అంటూ విభజన చేయకుండా అందరు రోగులతోపాటు చికిత్స అందించేలా చూడాలన్నారు.

ఆరోగ్యశ్రీ జాబితాలో చేరడానికి దరఖాస్తు చేసుకున్న ప్రైవేట్‌ ఆసుపత్రులకు నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన తరువాతే అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఆరోగ్యశ్రీ బకాయిలు వేల కోట్లలో ఉండేవని, కానీ ఇప్పుడు కేవలం రూ.199 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. వాటిని కూడా అతి త్వరలో చెల్లిస్తామన్నారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య కార్డు ఉన్నవారికి ఆసుపత్రుల్లో అన్ని వైద్య సేవలు అందేలా చూస్తామన్నారు.  

ఆరోగ్యశ్రీనే వంద రెట్లు మెరుగు 
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ కంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం 100 రెట్లు మెరుగైనదని మంత్రి ఈటల తెలిపారు. దానిలో లేని 517 చికిత్సలు మన ఆరోగ్యశ్రీలో ఉన్నాయన్నారు. పైగా ఇందులో 434 ఖరీదైన చికిత్సలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను కూడా కార్పొరేట్‌ స్థాయికి తీర్చిదిద్ది ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లే అవసరం లేకుండా చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య పెంచాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు